ఏపీ రోడ్ల పరిస్థితిపై జగన్ కీలక ఆదేశాలు

ఏపీ రోడ్ల పరిస్థితి సిఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాల పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అక్టోబరు మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయని.. తర్వాత పనుల కాలం మొదలవుతుందని తెలిపారు. ముందుగా రోడ్లను బాగుచేయడం పై దృష్టి పెట్టాలని మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలని ఆదేశించారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టామని.. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారని మండిపడ్డారు.

Jagan

మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడ్డాయని.. దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడ్డం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. అయితే వర్షాలు పడ్డం వల్ల మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు. రోడ్లను బాగుచేయడానికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని.. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుందని వివరించారు. ఒక నిధిని కూడా ఏర్పాటు చేసిందని.. దురదృష్టవశాత్తూ ఒక్క చంద్రబాబుతోనే కాదు పచ్చమీడియాతో మనం యుద్ధం చేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు లేకపోవడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకనే ప్రతి విషయంలో వక్రీకరణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దురుద్దేశంతో ప్రచారం చేసినా మనం చేయాల్సిన పనులు చేద్దామన్నారు. ఈ ప్రచారాన్ని పాజిటివ్‌గా తీసుకుని అడుగులు ముందుకేద్దామన్నారు. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే… నెగెటివ్‌ మీడియా ఎన్ని రాసినా ప్రజలు వాటిని గమనిస్తారని తెలిపారు. మనం బాగుచేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్ష్యాలుగా నిలబడతాయని వెల్లడించారు.