ఏపీలో పొత్తు పెట్టుకున్న బీజేపీ-జనసేన ఏ ఎన్నిక వచ్చినా కలిసి పోటి చేయాలని నిర్ణయించాయి. అంతవరకు బాగానే ఉన్నా ఎన్నికల్లో ఎవరు పోటి చేయాలన్నది రెండు పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతుంది. అయితే ఈ సందిగ్ధతకు చెక్ పెట్టేందుకు జనసేన కొత్త ప్యూహం రూపొందించిందట..మరి జనసేన ప్యూహం వర్కవుటుందా లేదా అన్నది ఇప్పుడు రెండు పార్టీల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక విషయంలో బీజేపీ,జనసేన మధ్య పంచాయితీ తెగడం లేదు. పైకి ఉమ్మడి అభ్యర్థి అని చెబుతున్నా.. ఆ ఉమ్మడి అభ్యర్ధి జనసేన, బీజేపీలలో ఏ పార్టీకి చెందినవారో క్లారిటీ లేదు. రెండు పార్టీలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో రెండు దఫాలుగా మీటింగ్‌లు అయినా..అభ్యర్ధి విషయం పై మాత్రం స్పష్టత లేదు. దీంతో రెండు పార్టీల మధ్య పీటముడి పడింది.
ఈ సమస్య ఇలా కొనసాగుతుండగానే రెండు పార్టీల నేతల మధ్య మాటల దాడి కొనసాగింది. తిరుపతి కేంద్రంగా రెండు పార్టీలు సమీక్షలు నిర్వహించాయి.జనసేన అయితే పదిమందితో ప్రత్యేకంగా కమిటీ వేసింది. క్షేత్రస్థాయిలో తమకు బలం ఉందన్నది ఆ కమిటీ వాదన. కానీ.. సీటు తమకే ఇవ్వాలని గట్టిగా అడగదు జనసేన. బీజేపీ సైతం బూత్‌స్థాయి కమిటీలకు రాష్ట్రస్థాయి నేతలను ఇంఛార్జులుగా పెట్టి కదనోత్సాహం ప్రదర్శిస్తోంది. ఏకంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను తిరుపతిలో నిర్వహించి శోభాయాత్రలు చేశారు కమలనాథులు. బైబిల్ కావాలో.. భగవద్గీత కావాలో తేల్చుకోవాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లాంటి వారు వేడి పుట్టించారు.
ఉప ఎన్నిక అభ్యర్ధి విషయంలో జనసేన ఇప్పుడు కొత్త థీరి చెబుతుందట.. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని అనుకున్నప్పుడు.. పోటీ వద్దంటూ బీజేపీ నేతలు సర్దుబాటు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొన్నాం కాబట్టి.. తిరుపతి లోక్‌సభ సీటును జనసేనకు వదిలేయాలన్నది ఆ పార్టీ వాదన. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎన్నికల కసరత్తులో భాగంగా తిరుపతిలో పవన్ పర్యటన సందర్భంగా ఆ పార్టీలో కొత్త పల్లవి వినిపిస్తోంది.
తిరుపతి లోకసభ సీటను బీజేపీకి వదిలేస్తాం.. సాధారణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను జనసేన, బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సుత్తి లేకుండా సూటిగా చెప్పేశారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో ఏమౌతుందో తెలియదు. కానీ.. ఉపఎన్నికకు.. రాబోయే ఎన్నికల్లో సీఎం కుర్చీకి బేరం పెట్టేసింది జనసేన. ఈ ప్రతిపాదన విన్న కమలనాథులు కంగు తిన్నారట.. సీఎం సీటు వదిలేయడం అన్నది బీజేపీ వరకు చాలా పెద్ద విషయం. దానిని రాష్ట్రస్థాయిలో తేల్చే విషయం కాదు. బీజేపీ జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని వదిలేశారట కమలనాథులు.
బీజేపీకి సీటు వదిలేస్తే..గ్రేటర్ ఎన్నికల మాదిరి గట్టిగా పోరాటం చేయగలదా ఒకవేళ జనసేన అభ్యర్థి బరిలో ఉంటే.. ఎంతమంది బీజేపీ జాతీయ నాయకులు ప్రచారానికి వస్తారు అన్నది చర్చకు వచ్చింది. ఒకపక్క బెంగాల్ ఎన్నికలు మరో పక్క రైతుల నిరసనలతో బీజేపీ నేతలు సతమతమవుతున్న వేళ జనసేన ప్రతిపాదన ఎంత వరకు వర్కవుటవుతుందో చూడాలి.