మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలన్ని ప్రచారం ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లు ప్రత్యేకంగా భారీ బహిరంగ సభలు పెట్టి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మునుగోడులో యువతీ యువకులను ఆకర్షించడానికి కేఏ పాల్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
తన 59వ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని 59 మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేయనున్నట్లు కేఏ పాల్ తెలిపారు. ఎంపిక చేసిన వారికి పాస్‌పోర్ట్, అమెరికా వీసా ఉచితంగా ఇప్పించనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్, మోదీ యువతను మోసం చేశారన్న పాల్ విమర్శించారు. నిరుద్యోగుల కష్టాలు తనకే తెలుసని అన్నారు. తన జన్మదిన కానుకగా అందిస్తున్న అవకాశాన్ని మునుగోడు యువత ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.