ఖాళీ పేపర్లు ఇచ్చి నామినేషన్ వేసిన కేఏపాల్.. షాకయిన ఎన్నికల అధికారులు..!

ఆయనకు ఓ పార్టీ ఉంది కదా. ఏ పేరది.. అదే ప్రజాశాంతి.. ఆ పార్టీ తరుపున పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడట.

కేఏ పాల్… నిండు చందురుడు ఒక వైపు.. చుక్కలు ఒకవైపు.. నేను ఒక్కడిని ఒకవైపు.. లోకం ఒకవైపు అని అనే రకం. సాధారణంగా ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు నామినేషన్ ఎలా వేస్తారో తెలుసు కదా. చివరకు వాళ్లపై ఉన్న కేసుల గురించి కూడా నామినేషన్ లో పేర్కొనాల్సి ఉంటుంది.

కానీ.. కేఏపాల్ అందరిలాంటి మనిషి కాదు కదా. అందుకే తను ఖాళీ పత్రాలతో నామినేషన్ వేశాడట. నమ్మబుద్ధి కావడం లేదా? ఆయన నామినేషన్ పత్రాలను చూసి ఎన్నికల అధికారులే షాకయ్యారట.

ఆయనకు ఓ పార్టీ ఉంది కదా. ఏ పేరది.. అదే ప్రజాశాంతి.. ఆ పార్టీ తరుపున పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడట. ఈసందర్భంగా కేఏపాల్ నామినేషన్ సమర్పించాడట. తన నామినేషన్ లో కేవలం తన పేరు, ఊరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ తప్పించి మిగితా వివరాలేమీ ఇవ్వలేదట. తన పేరు కిలారి ఆనంద్ గా(ఆయన అసలు పేరు అదే), ఊరు వైజాగ్ లోని న్యూరైల్వే కాలనీలో ఉన్న తన ఇంటి అడ్రస్ ను ఇచ్చాడట. నామినేషన్ పేపర్లపై తన ఫోటో కూడా అంటించలేదట.

ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాల్లో ఏ అంశాలు నింపాలో అప్పుడు చెప్పడంతో తన విద్యార్హతలు, ఇతర వివరాలను అందులో పొందుపరచారట కేఏ పాల్. ముందుగా తన పేరు, ఫోన్ నెంబర్ తో పాటు తన వయసు 55 ఏళ్లని… పోటీ చేస్తోంది ప్రజాశాంతి పార్టీ తరుపున అని మాత్రమే వెల్లడించారట. తన కులం, మతం, ఇతర వివరాలేవీ ఇవ్వలేదట.

ఇక.. తన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను తెలిపే అఫిడవిట్ ను కూడా కేఏ పాల్ జతచేయలేదట. కాకపోతే తన వద్ద 30 వేల రూపాయలు ఉన్నట్టు తెలిపారట. బ్యాంకు ఖాతా వివరాలకు సంబంధించిన ఫాంలోనూ ఏమీ నింపలేదట. అయితే.. నామినేషన్ కోసం కావాల్సిన అన్ని పత్రాలను 25 తేదీ లోపు సమర్పించాలని ఎన్నికల అధికారులు పాల్ కు సూచించారట. అది కేఏ పాల్ నామినేషన్ సంగతి.