తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పై సమరానికి సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. వచ్చీ రాగానే రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పలు కార్యక్రమాలకు వ్యూహరచన చేస్తున్నారు. ఈనెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహణకు అదేశాలిచ్చారు.కృష్ణా ప్రాజెక్టులు అప్పగించడాన్ని ప్రశ్నించడానికే ఈ సభ నిర్వహిస్తున్నారు. నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలను తరలించాలని పార్టీ నేతలకు సూచించారు.మొదటి సభలోనే కాంగ్రెస్ కి వణుకు పుట్టించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.కాంగ్రెస్ తప్పులను నిలదీయడమే కాకుండా రానున్న లోక్ సభ ఎన్నికలకు కేడర్ కు దిశా నిర్దేశం చేసేలా ఈ బహిరంగ సభను ప్లాన్ చేశారు
దక్షిణ తెలంగాణ లీడర్లతో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సంద్భంగా కేసీఆర్ ఈనెల 13 న నల్లగొండ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు నేతలకు స్పష్టం చేశారు.రాష్ట్రంలోని కాంగ్రెసుతో పాటు కేంద్రంలోని బీజేపీతో కూడా బీఆర్ఎస్ గేమ్ స్టార్ట్ అయిందని ఈ సమావేశంలో కేసీఆర్ తన కేడర్ కి క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్ట్ లు కేంద్రం ఆధీనంలోకి వెళితే తెలంగాణ నష్టపోతుందని, కాంగ్రెస్ నేతలకు అవగాహన లేక ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన మండిపడుతున్నారు.డ్యాం కు సున్నం వేయాలన్న కూడా బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ నెల 13న సభ నిర్వహించి తీరుతామని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సాగునీటి, తాగునీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే ‘మా నీళ్లు మాకే’ అనే నినాదాన్ని గట్టిగా వినిపించారు.వేగంగా ప్రాజెక్టులు కట్టి ఈ నినాదాన్ని నిజం చేశారు.కేంద్రం ఒత్తిడిని ఎదిరిస్తూ కృష్ణా నది ప్రాజెక్టులపై తెలంగాణ హక్కులను కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాపాడిందని అందరికీ తెలిసిందే.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తబోతోంది. ప్రజల మద్దతు కూడగట్టి ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాల వైఖరిని ప్రశ్నించనున్నారు కేసీఆర్. అవసరమైతే నీటికోసం తెలంగాణ సాధన తరహాలో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు,కార్యకర్తలకు కేసీఆర్ స్పష్టం చేశారు.