తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గత ఎన్నికల కంటే ఈ సారి ఎన్నికలు హోరాహోరిగా జరగడం ఖాయం. గత రెండు ఎన్నికలని బిఆర్‌ఎస్ వన్ సైడ్ గా గెలుచుకుంది. కానీ ఈ సారి గెలుపు అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అదే సమయంలో బిజేపి సైతం కొన్ని సీట్లలో పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అధికార బిఆర్‌ఎస్ పార్టీకి విజయం సులువు కాదు.
కాకపోతే ఎన్నికలకు బిఆర్‌ఎస్ పార్టీ ముందే రెడీ అయిపోయింది. ఇప్పటికే అభ్యర్ధులని ఫిక్స్ చేసేసి..ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బిజేపిలు సైతం దూకుడుగా రాజకీయం మొదలుపెట్టాయి. ఇప్పటికే కాంగ్రెస్ పోటీ చేసే అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించి..వారిలో బెస్ట్ అభ్యర్ధులని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అలాగే రాజకీయంగా సత్తా చాటడానికి జాతీయ నేతలంతా తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అలాగే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. మొదట పరేడ్ గ్రౌండ్స్ లో సభ నిర్వహించాలని అనుకున్నారు.
కానీ అప్పుడే బిజేపి సైతం సభకు ప్లాన్ చేసింది. దీంతో పరేడ్ గ్రౌండ్ దక్కే ఛాన్స్ లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ శివారు ప్రాంతమైన తుక్కుగూడలో సభకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఆ తర్వాత రోజు జాతీయ నేతలంతా 119 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఇటు బిజేపి సైతం 17న సభకు ప్లాన్ చేసింది. అటు అభ్యర్ధుల ఎంపికని మొదలుపెట్టింది.
ఇలా రాజకీయంగా కాంగ్రెస్, బిజేపి దూకుడు ప్రదర్శిస్తున్నాయి. సెప్టెంబర్ 17 ప్రధాన టార్గెట్. అయితే దానికంటే ఒక రోజు ముందు కేసిఆర్ భారీ స్కెచ్ తో ముందుకొస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుని ప్రారంభించనున్నారు. దీని ద్వారా బిఆర్‌ఎస్ అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీఠ వేస్తుందనే సందేశాన్ని ఇవ్వనున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 17కి తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కనుంది.