తెలంగాణ ప్రతిపక్ష నేత,బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ అనారోగ్యంతో బాధపడటం,కోలుకోవడం వంటి వాటితో మూడు నెలలు గడిచిపోయాయి. లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన పొత్తుల కోసమే అని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఢిల్లీలో ఆయన ఎవరిని కలుస్తారనేది క్లారిటీ లేదు. బీజేపీ అగ్రనేతలను కలుస్తారా లేక మరేదైనా పని మీద వెళ్తున్నారా అంటూ ఊహాగానాలు నడుస్తున్నాయి.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల కొన్ని కీలక కామెంట్లు చేశారు.ఎన్డీఏతో కలిసి వచ్చేందుకు చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పిన షా…త్వరలోనే ఎన్డీఏలో భారీగా చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు.కేసీఆర్ ఢిల్లీ పర్యటన వేళ అమిత్ షా మాటలకు బలం చేకూరుతుంది. ఇటీవల బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని బలంగా వినిపిస్తోంది.
అయితే ఈ పొత్తుపై బీఆర్ఎస్ నేతలు ఎక్కడా ఇప్పటివరకు మాట్లాడలేదు.వాటిని బట్టి చూస్తే ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సుమారు 20 రోజుల సమయం ఉంది.అయితే, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవర్ని కలుస్తారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.
తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం నా నా ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అండ్ కో ని ఇరుకున పెట్టేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్వామ్యం ఉన్న ఏ ఒక్కరిని వదలబోమని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.మిగతా ప్రాజెక్టుల విషయంలోనూ సమీక్షలు, పర్యటనలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ ని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ని ఒంటరిగా ఢీ కొనడం కష్టమని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే ఢిల్లీ వెళ్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తారా చూడాలి.