టీపీపీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన దూకుడు పెంచారు. రాష్ట్రంలోని నీనియర్ నాయకులను కలుస్తూ పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర రాజకీయాలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి మంగళవారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భేటీ అయిన సంగతి తెల్సిందే. దీంతో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఉహాగానాలు మొదలయ్యాయి.
అయితే తను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తనను కాంగ్రెస్‌లోకి రమ్మని అడగలేదని… తను కూడా కాంగ్రెస్‌లో చేరుతానని రేవంత్ రెడ్డికి చెప్పలేదని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగం, నీటి పారుదల, కృష్ణా జలాలు, వ్యవసాయం, పంట కొనుగోలు, మద్దతు ధర, ప్రజాస్వామ్య పరిరక్షణ తదితర అంశాల మీద తాము చర్చించినట్లు విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేసారు.తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసాక రేవంత్ రెడ్డిని కలవడం ఇదే మొదటిసారని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే రాష్ట్ర ప్రజాస్వామ్యానికి మంచిదని విశ్వేశ్వర్‌రెడ్డి రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణలో కేసీఆర్ మీద పోరాడే బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి అని… తను గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా ఇదే విషయాన్ని అనుకున్నట్లు చెప్పారు. కాగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 2014 లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. అయితే 2019లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటీవలే జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు.