తెలుగు సీఎంల న్యూ స్ట్రాటజీ..జాతీయ పార్టీలు బుక్ అవుతాయా?

-

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ పభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఆ ప్రాజెక్టు అక్రమమని చెప్పి తెలంగాణ నేతలు విమర్శలు చేశారు. అటు ఏపీ నేతలు సైతం తెలంగాణకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాజెక్టులని అక్రమంగా కట్టిందని, శ్రీశైలం పులిచింతల ప్రాజెక్టుల వద్ద పరిమితికి మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని చెప్పి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

అయితే ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ నీటి వివాదంలోకి రెండు జాతీయ పార్టీలని లాగే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక వ్యూహం ప్రకారమే తెలుగు సీఎంలు కాంగ్రెస్, బీజేపీలని ఈ నీటి వివాదంలో ఇరికించి రాజకీయంగా దెబ్బకొట్టడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది.  మొదట ఈ వివాదాన్ని కేంద్రం కోర్టులో పెట్టి తెలుగు సీఎంలు సరికొత్త రాజకీయ క్రీడకు తెరలేపారు.

ఇప్పుడు కేంద్రం ఈ నీటి వివాదంలో జోక్యం చేసుకున్నా, జోక్యం చేసుకోకపోయినా రాజకీయంగా మాత్రం రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఇబ్బందికర పరిస్తితులు రావడం ఖాయం. రెండు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఇది ఓ రకంగా ఇబ్బందికరమైన పరిస్తితే. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి నూకలు చెల్లినట్లే.

ఇప్పటికే పలు హామీలని అమలు చేయలేదని బీజేపీని, ఏపీ ప్రజలు నమ్మట్లేదు. అక్కడ ఆ పార్టీకి అసలు బలం లేదు. కానీ తెలంగాణలో బీజేపీ ఇప్పుడుప్పుడే పుంజుకుంటుంది. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని మాట్లాడుతున్నారు. అలాగే ఈటల రాజేందర్‌ని చేర్చుకున్న బీజేపీ, హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు చెక్ పెడతామని చెబుతుంది.

ఈ క్రమంలోనే కేసీఆర్-జగన్‌లు కలిసి తెరపైకి తీసుకొచ్చిన నీటి వివాదం వల్ల తెలంగాణలో బీజేపీకి చెక్ పడిపోతుంది.  ఈ అంశంలో కేంద్రాన్ని ఇరుకున పెడితే, రాష్ట్రంలో బీజేపీకి భారీ షాక్ తగులుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ని కూడా ఇరుకున పెట్టడమే కేసీఆర్-జగన్‌ల లక్ష్యంగా కనిపిస్తుంది. ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి బాగోకపోయినా సరే, తెలంగాణలో ఆ పార్టీకి బలం ఉంది. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. ఇలాంటి పరిస్తితిల్లో నీటి వివాదం కాంగ్రెస్‌కు ఇబ్బందే. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇద్దరు సీఎంలు ప్లాన్ చేశారని తెలుస్తోంది.

అంటే ఈ నీటి వివాదంతో కేసీఆర్-జగన్‌లు..ఏక కాలంలో బీజేపీ-కాంగ్రెస్‌లకు చెక్ పెట్టడమే వ్యూహంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. జాతీయ పార్టీలని తెలుగు రాష్ట్రాల్లో ఎదగనివ్వకుండా దెబ్బకొట్టాలనేది కేసీఆర్-జగన్‌ల ప్లాన్‌గా ఉందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news