ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే అక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కన్నా ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపాకు రోజు రోజుకీ సినీ గ్లామర్ పెరుగుతుందనే చెప్పవచ్చు. ఇప్పటికే పలువురు సినీనటులు వైకాపాకు మద్ధతు తెలపగా వారి జాబితాలోకి మరో నటుడు కూడా వచ్చి చేరాడు. అతనే కృష్ణుడు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాక, కొన్ని సినిమాల్లో హీరో రోల్ చేసి కూడా కృష్ణుడు ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇకపై ఇతను రాజకీయాల్లోనూ కొనసాగనున్నాడు. అందులో భాగంగానే తాజాగా వైకాపాలో చేరాడు.
సినీ నటుడు కృష్ణుడు తాజాగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. జగన్ సమక్షంలో ఆయన వైకాపాలో చేరాడు. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే జగన్‌ను కలిసిన కృష్ణుడు ఆయన సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ కృష్ణుడికి వైకాపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే నటులు పోసాని కృష్ణమురళి, పృథ్వీలు చేరారు. సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు కూడా తన మద్దతు జగన్‌కే తెలపగా ఇప్పుడు వారితోపాటు కృష్ణుడు ఆ జాబితాలో చేరాడు. ఈ సందర్భంగా కృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు స్ఫూర్తి పొంది తాను వైకాపాలో చేరానని, ఏపీలో వైసీపీ విజయం సాధించడానికి, 2019 ఎన్నికల్లో వైకాపా ఏపీలో అధికారంలో రావడానికి తన వంతు కృషి చేస్తానని కృష్ణుడు చెప్పాడు. ఇక ముందు ముందు ఎంత మంది సినీ తారలు వైకాపాలో చేరతారో చూడాలి.