కేటీఆర్‌కు చిరాకు తెప్పిస్తున్న మాజీలు..!

-

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మునిసిపల్‌ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల కన్నా కాక పుట్టిస్తున్నాయి. రెబెల్స్‌గా తాజా మాజీల అనుచరులే ఉండటం కేటీఆర్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

తెలంగాణలో మున్సిపల్‌ ఎలక్షన్ల హడావుడి ఊపందుకుంది. 22నే ఎన్నికలు కావడంతో, బరిలో ఉన్న అభ్యర్థులు, వారి నాయకులు అందరూ ప్రచారంలో తలమునకలుగా ఉన్నారు. ఎటూ టీఆర్‌ఎస్‌ ప్రచారంలో ముందుంది. ఫలితాలు కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చే అవకాశాలే ఎక్కువ. అయితే ఈ రెబెల్స్‌ బెడద మాత్రం టిఆర్‌ఎస్‌ను గట్టిగా పట్టి పీడిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనుండగా, బరిలో దాదాపు 12వేల మంది అభ్యర్థులున్నారు. ఇందులో రెబెల్స్‌ రూపంలో అధికార పార్టీకి అధికసంఖ్యలో అభ్యర్థులు తయారయ్యారు. ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెల్యేలకు టికెట్లిచ్చే అధికారమిచ్చి, ఓ వార్నింగ్‌ కూడా ఇచ్చారు. మీ నియెజకవర్గంలో ఓడిపోతే, మీరు కూడా పోయినట్లేనని దాని సారాంశం. దాంతో వారు నియోజకవర్గాలకు వెళ్లి, నానాహైరానా పడుతున్నారు.

ఇక్కడే ఒక చిక్కువచ్చిపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన 12 సీట్లలో ఓడిపోయిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతోనే ఈ చిక్కంతా. ఈ ఎన్నికల్లో వారి క్యాడర్‌నే పోటీ అభ్యర్థులుగా నిలబెట్టారు. ఎమ్మెల్యేలు ఎటూ వారు నిర్ణయించిన వారినే అధికారిక అభ్యర్థులుగా టికెట్లిచ్చుకున్నారు. ఇప్పుడు రెబెల్స్‌ను తప్పించడం అధిష్టానానికి సమస్యగా మారింది.

మాజీల మాటేంటంటే, ఇప్పుడు క్యాడర్‌ను వదిలేసి, అధిష్టానం చెప్పినట్లు వింటే, వెంట తిరిగే వాడెవడూ ఉండడు. అసలే ఓడిపోయి ఉన్నారు. ఆ కాస్తా క్యాడర్‌ కూడా లేకపోతే ఎవరూ తమను లెక్కపెట్టరు. ఆఖరుకు అధిష్టానం కూడా… అనేది

వీరి లా పాయింటు. ఇదీ నిజమే. ఒకవేళ తమ అభ్యర్థులే గెలిస్తే, అధిష్టానం ఎటూ తమను మళ్లీ దగ్గరకి తీసుకుంటుంది అని భావన. సరిగ్గా ఈ ఆలోచనతోనే కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పావులు కదుపుతున్నారు. ఆయన తన వర్గీయులు 20మందికి ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరపున టికెట్లిప్పించి, బరిలో నిలబెట్టారు. విషయం కేటీఆర్‌కు తెలిసి, పిలిపించి మాట్లాడినా, అలాంటిదేం లేదని కూడా తిరిగి తనవాళ్ల తరపున ఇంటింటి ప్రచారం సాగిస్తున్నాడు. కేటీఆర్‌ పాపం, ఎటూ తేల్చుకోలేక, ఎటువంటి చర్యా తీసుకోలేక తర్జనభర్జన పడుతున్నారు. అసలే ఆయన ‘అస్మదీయుడు’ కూడా.

ఇదే సమస్య మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఉంది. కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, గద్వాల జిల్లా అయిజలలో ఈ పరిస్థితి తారాస్థాయికి చేరిందని వినికిడి. దానికి తోడు, కాంగ్రెస్‌లో గెలిచి, టీఆర్‌ఎస్‌లో చేరిన ఈ పన్నెండుమంది ఎమ్మెల్యేల తీరు కూడా మాజీలకు నచ్చడంలేదు. ఎక్కడా తమను కలుపుకుని పోవడంలేదన్నది వారి బాధ. అయితే, ఇదంతా రాజకీయాల్లో సర్వసాధారణం. అందరికీ తెలిసిన విషయమేమిటంటే, ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు’.

 

Read more RELATED
Recommended to you

Latest news