మొన్నటివరకు తెలంగాణ బిజేపి నేతలు వర్సెస్ అధికార బిఆర్‌ఎస్ నేతలు అన్నట్లు వార్ నడిచేది. ఇప్పుడు సీన్ మారింది. బిఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు యుద్ధం జరుగుతుంది. ఇటీవల కాంగ్రెస్ దూకుడు మీద ఉండటం..ఆ పార్టీలోకి వలసలు పెరగడం…ఇంకా బిజేపికి ఆ పార్టీనే ప్రత్యామ్నాయం అనే పరిస్తితి వచ్చింది. ఇక బిజేపి ఎంత డౌన్ అయితే బిఆర్‌ఎస్ పార్టీకి అంత నష్టం. అందుకే ఆ నష్టం జరగకుండా ఉండటానికి..ఓ వైపు బిజేపి రాష్ట్రానికి ఏమి చేయలేదు అని విమర్శిస్తూనే..టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బిఆర్‌ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు.
ఇటీవల రేవంత్ ధరణి పోర్టల్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేటిఆర్ డైరక్ట్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ధరణిలో అక్రమాలు జరిగాయని చెబుతున్నా రేవంత్ రెడ్డి..తన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సైతం అందించి విచారణ చేయించుకోవచ్చని అన్నారు. ధరణి ద్వారా జరిగిన లబ్ధిని తాము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు చెబుతామని అన్నారు.
సమాచార హక్కు చట్టం ద్వారా అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన రేవంత్ రెడ్డి… ఈరోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ అయితే ఓర్వలేక పోతున్నారని విమర్శించారు.
ఒక రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అని, అందుకే మోదీని ఒక మాట అనడం లేదని, అందుకే తాము గాంధీ భవన్ లో గాడ్సే దూరిండు అంటున్నామని చెప్పుకొచ్చారు. ఇక ప్రధాని మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో..తెలంగాణకు ఏం చేశారని మోదీ వస్తున్నారని కేటిఆర్ అన్నారు. అయితే కేటిఆర్ టార్గెట్ మొత్తం రేవంత్ పైనే ఉంది. కాంగ్రెస్ పికప్ అవుతున్న నేపథ్యంలోనే కేటిఆర్ టార్గెట్ మార్చారని తెలుస్తుంది.