కేటీఆర్‌కు ఆ అర్హత లేదు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హత లేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌లో హరీశ్ రావు, ఈటల రాజేందర్ లతో పాటు స్పీకర్ లకు పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు సీఎం అయ్యే అర్హత ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. వ్యక్తిగతంగా కేటీఆర్ చాలా మంచి వ్యక్తి అని… కానీ సీఎం పదవిని చేపట్టేందుకు మాత్రం ఆయన తగిన వ్యక్తి కాదని చెప్పుకొచ్చారు.ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసారు.

సీఎం కేసీఆర్ మంచి వాళ్లందరినీ దూరం చేసుకున్నారని, చెడ్డవారందరినీ చేరదీస్తున్నారని అన్నారు. కేసీఆర్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో చాలా వ్యతిరేకత ఉందన్నారు. ఇద్దరు మంత్రులు కూడా తమతో టచ్‌లో ఉన్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరముందన్న కొండా దాని కోసం తానతో సహా, ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో తెలంగాణ కీలక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ను ఎదిరించే స్థాయి కాంగ్రెస్ పార్టీకి లేదని … రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనం అయినందునే తాను పార్టీని వీడినట్లు వివరణ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీకి టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నా.. వాళ్లకు ధైర్యం కావాలని అన్నారు. ఇక తెలంగాణలో షర్మిల పొలిటికల్ ఎంట్రీపై స్పందిస్తూ ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తాను అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు.