వైసీపీ పై టీడీపీ పోరు ఉద్ధృతం అయిన నేపథ్యంలో యువ నేత లోకేశ్ మరింత స్వరం హెచ్చించి తన గొంతుక వినిపిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో దూసుకుపోతున్న వైసీపీకి చెక్ పెట్టేందుకు అదేవిధంగా కొన్ని సున్నిత అంశాలపై ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఎంతన్నది ప్రశ్నించేందుకు ఆయన తరుచూ సోషల్ మీడియాను పరిమితికి మించి వాడుకుంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా ఇక్కడే ఆయన మరింత యాక్టివ్ అవుతున్నారు.
గతంలో తమ హయాంలో చాలా కీలకంగా మారిన వాల్మీకి కులస్థుల విషయాన్ని వారిని ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియ ఆగిన వైనాన్నీ ఇవాళ తెరపైకి తెచ్చారు. వాల్మీకి కులస్థులతో పాటు బోయ కులానికి చెందిన వారినీ ఎస్టీ జాబితాలో చేర్చాలని ఓ ప్రతిపాదన ఉంది. కానీ ఎస్టీల్లో వీరిని చేర్చేవిషయమై గిరిజనుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.ఈ రెండు సామాజిక వర్గాలు తమ జాబితాలో చేరితే రిజర్వేషన్ శాతం తగ్గిపోతుందన్న ఆందోళన ఎప్పటినుంచో వెల్లడి చేస్తున్నారు.
దీంతో ఈ సున్నిత అంశాన్ని ఎన్నికల ప్రచారం వరకే వాడుకుని తరువాత జగన్ పెద్దగా పట్టించుకోలేదని విపక్షం చాలా రోజులకు తేనెతుట్టను కదిపింది.ఈ క్రమంలో ఇదే విషయమై మంత్రివర్గ తీర్మానాన్ని ఆ రోజు చంద్రబాబు సర్కారు చేసిన వైనాన్ని మరో మారు స్పృశిస్తూ కొత్త వివాదానికి చినబాబు తెలివిగానే తావిచ్చారు. ఇందులో భాగంగా ఆ రోజు తాము అవలంబించిన ప్రొసిజర్ కోడ్ ను మొత్తం వివరిస్తూ ఇవాళ జగన్ కు లేఖ రాసి మరో సారి సంచలనం అయ్యారు చినబాబు.
ఇదే ఇప్పుడు చర్చకు తావిస్తున్న విషయం. కొద్ది నిమిషాల కిందట ఆయన రాసిన లేఖ ప్రతిని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇందులో అనేక విషయాలు చేర్చారు. తాము ఈ విషయమై గతంలోనే కొంత సమాచారం సేకరించి కేంద్రానికి విన్నవించామని, తరువాత వైసీపీ ఎంపీలు ప్రచారార్థం పీఎం మోడీని కలిశారని పేర్కొంటూ లోకేశ్ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా మా మీద కక్షను బోయలపైనా, వాల్మీకి కులస్తులపైనా చూపించవద్దని విన్నవిస్తూ తన లేఖను ముగించారు.