మధ్యప్రదేశ్ లో రాజకీయాలు ఉత్కంట గా మారాయి. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీలో బలపరీక్ష జరగనున్న నేపధ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బలపరీక్ష ఎదుర్కోకుండా నే కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది. ఎమ్మెల్యేలు ఎంతకు తిరిగి రాకపోవడంతో కమలనాథ్ రాజీనామా చేయడానికి సిద్దమయ్యారు. ఆయన గవర్నర్ ని కలిసి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. 15 ఏళ్ళలో బిజెపి చేయలేనిది తాను 15 నెలల్లో చేసి చూపించా అని కమల్ నాథ్ అన్నారు. తాను రాష్ట్రానికి సమర్ధవంతమైన పాలన అందించా అని చెప్పుకొచ్చారు. బిజెపి మా ఎమ్మెల్యేలను బంధించింది అని చెప్పుకొచ్చారు. ప్రజా తీర్పుని బిజెపి అపహాస్యం చేస్తుందని అన్నారు. రాష్ట్రానికి కొత్త రూపు ఇవ్వడానికి తాను ప్రయత్నాలు చేశా అన్నారు.
5 ఏళ్ళ పాలన కోసం ప్రజలు తమకు ఓటు వేసారని, కాని కర్ణాటకలో మా ఎమ్మెల్యేలను బంధించిందని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో ఆయన చర్చలు జరిపారు. అనంతరం రాజీనామా చేయడానికి సిద్దమయ్యారు. గవర్నర్ ని కలిసి రాజీనామా లేఖను అందించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల బిజెపి లో చేరిన జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసారు.