పాతబస్తీ అంటే మజ్లిస్ అడ్డా అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మొదట నుంచి అక్కడ మజ్లిస్ హవా నడుస్తుంది. ఇక ఎంఐఎం పార్టీ కంచుకోటగా ఉన్న స్థానాల్లో యాకుత్‌పురా ఒకటి. ఇక్కడ మజ్లిస్ పార్టీ ఆరుసార్లు విజయం సాధించింది. పాతబస్తీలో ఉన్న ఈ సీటులో మొదట కాంగ్రెస్ గెలిచింది. కొన్నాళ్లు ఇండిపెండెంట్ అభర్ధులు గెలిచారు. 1989 నుంచి యాకుత్‌పురాలో మజ్లిస్ హవా మొదలైంది.
అయితే 1994లో మజ్లిస్‌కు యాంటీగా వచ్చిన మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ అభ్యర్ధి గెలిచారు. ఆ పార్టీ నుంచి గెలిచిన ముంతాజ్ అహ్మద్ ఖాన్..తర్వాత ఎంఐఎంలోకి వెళ్లారు. 1999 ఎన్నికల్లో ఖాన్..ఎంఐఎం నుంచి గెలిచారు. అక్కడ నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. గతంలో ఎంఐఎంకు కాంగ్రెస్ మద్ధతు ఉండేది. 2014 నుంచి బిఆర్‌ఎస్ సపోర్ట్ వచ్చింది. అయితే బిఆర్‌ఎస్ పోటీ చేసేది కానీ నామమాత్రంగానే పోటీకి దిగేది.
2014లో ఈ సీటులో బిఆర్‌ఎస్‌కు 7 వేల ఓట్లు వచ్చి డిపాజిట్ కోల్పోయింది. మజ్లిస్ బచావో పార్టీ అభ్యర్ధికి 28 వేల ఓట్లు వస్తే, బిజేపికి 32 వేల ఓట్లు వచ్చాయి. కానీ ఎంఐఎంకి 66 వేల ఓట్లు వచ్చి..34 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2018లో ఎంఐఎం నుంచి సయ్యద్ అహ్మద్ బాషా ఖాద్రీ పోటీ చేసి 46 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇటు బిఆర్‌ఎస్‌కు 22 వేల ఓట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అయితే ఈ సారి కూడా ఇక్కడ మజ్లిస్ హవా నడవటం ఖాయంగా కనిపిస్తుంది.
ఆ పార్టీకి బిజేపి, మజ్లిస్ బచావో పార్టీలు చెక్ పెట్టాలని చూస్తున్నాయి. ఇటు బిఆర్‌ఎస్ పోటీ గట్టిగా ఇచ్చే పరిస్తితి లేదు. అయితే మిగతా రెండు పార్టీలైన మజ్లిస్‌కు పోటీ కాదు. కాబట్టి మళ్ళీ యాకుత్‌పురా మజ్లిస్ ఖాతాలోనే పడేలా ఉంది.