రోజాకు మంత్రిగా చాన్స్ ఇచ్చి ఉండాల్సింది.. విజ‌య‌శాంతి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

కేసీఆర్ త‌న మంత్రివర్గంలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌గా అవ‌కాశం క‌ల్పించ‌లేద‌ని, కానీ జ‌గ‌న్ మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేయాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని విజ‌య‌శాంతి ప‌రోక్షంగా చెప్పారు.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌లే అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారికి స‌మ ప్రాధాన్యం క‌ల్పిస్తూ త‌న కేబినెట్‌లో ప‌లువురికి మంత్రులుగా అవ‌కాశం ఇచ్చిన విష‌యం విదిత‌మే. అయితే రోజాకు మాత్రం జ‌గ‌న్ ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలో ఆమెకు నామినేటెడ్ ప‌ద‌వుల్లో కీల‌క‌మైన ఆర్‌టీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తారని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే రోజాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంపై సినీన‌టి, కాంగ్రెస్ పార్టీ మ‌హిళా నేత విజ‌య‌శాంతి స్పందించారు. ఈ మేరకు ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప‌లు పోస్టులు పెట్టారు.

సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజాకు కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని, సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని, వారికి కూడా తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని తాను చెప్పదలుచుకున్నాన‌ని విజ‌య‌శాంతి అన్నారు. రాబోయే రోజుల్లోనైనా జగన్ రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్న‌ట్లు విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు.

అయితే జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించార‌ని విజ‌య‌శాంతి చెబుతూనే ఇటు సీఎం కేసీఆర్‌పై కామెంట్లు చేశారు. కేసీఆర్ త‌న మంత్రివర్గంలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌గా అవ‌కాశం క‌ల్పించ‌లేద‌ని, కానీ జ‌గ‌న్ మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేయాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని విజ‌య‌శాంతి ప‌రోక్షంగా చెప్పారు. అయితే మ‌రి అస‌లు సీఎం జ‌గ‌న్ మ‌నస్సులో ఏముందో మ‌న‌కేం తెలుస్తుంది. క‌నుక ఈ విషయంలో మ‌నం వేచి చూడ‌డం త‌ప్ప చేసేదేమీ లేదు..!