జాతీయ స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంత పేరు ఉందో చెప్పాల్సిన పని లేదు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఢిల్లీ స్థాయిలో బాబు అనేకసార్లు చక్రం తిప్పారు. ప్రధాన మంత్రులని డిసైడ్ చేసే స్థాయికి వెళ్లారు. తను ఒక మాట చెబితే చాలు…ఢిల్లీ కూడా వినే పరిస్తితి ఉండేది. అయితే ఇదంతా ఒకప్పుడు మాత్రమే..అది కూడా 2004 ముందు వరకే. అప్పుడు బాబు జాతీయ స్థాయిలో చక్రాలు బాగానే తిప్పారు. కానీ తర్వాత నుంచే ఆ చక్రాలు తిరగడం లేదు.
ఇక 2019 ఎన్నికల నుంచి అయితే పరిస్తితి మరీ దారుణంగా తయారైంది. అసలు బాబు గోడు వినిపించుకునే జాతీయ నాయకులే లేరు. ఎలాగో 2019 ఎన్నికల ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకుని….మోడీ, అమిత్ షాలని ఇష్టారాజ్యంగా తిట్టారు. ఇక ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో ఎలా చూపించిందో చెప్పాల్సిన పని లేదు. ఓడిపోయాక బాబు పరిస్తితి ఢిల్లీ స్థాయి నుంచి గల్లీకి పడిపోయినట్లైంది. అయితే బాబు మళ్ళీ ఢిల్లీ పెద్దలకు దగ్గరవ్వడానికి ప్రయత్నాలు బాగానే చేశారు. కానీ ఢిల్లీ పెద్దలు బాబుని దూరంగానే పెట్టారు.
తాజాగా కూడా బాబుకు ఊహించని అవమానం ఎదురైంది. ఇటీవల టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడులు చేసిన నేపథ్యంలో చంద్రబాబు…తాజాగా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు. సరే రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకడంతో బాబు బాధలు చెప్పుకున్నారు.
కానీ ఆయనకు మోడీ, అమిత్ షాల అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. రెండురోజులు ఢిల్లీలో మకాం వేసిన ఉపయోగం లేదు. అసలు బాబుతో మాట్లాడటానికి ఆ ఇద్దరు నేతలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అయితే దాడుల ఘటన వంకతో బాబు…ఆ ఇద్దరినీ కలిసి బీజేపీకి దగ్గరవుదామని అనుకున్నారు. కానీ వారు బాబుకు ఛాన్స్ ఇవ్వలేదు. మొత్తానికి ఢిల్లీ స్థాయిలో బాబు చక్రాలు ఆగిపోయాయని చెప్పాలి.