రెండో రాజధానిగా హైదరాబాద్… మరో సంచలన నిర్ణయం దిశగా కేంద్రం..?

కేంద్రంలో బంపర్ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంది. దేశం మొత్తం ఆధిక్యం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ లో పలు కీలక బిల్లులని తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం తాజాగా జమ్మూ-కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం, విభజన చేసి కేంద్ర ప్రాలిత ప్రాంతాలుగా చేసింది. ఈ నిర్ణయాన్ని దేశంలో చాలా పార్టీలు సమర్ధించాయి కూడా. ఈ తరుణంలోనే మరో కీలకాంశం తెరపైకి వచ్చింది.

modi government may focus on Hyderabad is the second capital
modi government may focus on Hyderabad is the second capital

ఎప్పటి నుంచో హైదరాబాద్ ని రెండో రాజధాని చేసి సుప్రీం కోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ డిమాండ్లకి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఉత్తర భారత్ పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ.. ఈ పని చేస్తే దక్షిణాదిలో కూడా మైలేజ్ వస్తుందని, అందులోనూ తెలంగాణలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని భావిస్తుంది. అయితే దీంతో పాటు మరో నిర్ణయం కూడా తీసుకోవాలని బీజేపీ చూస్తోంది. హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి దేశానికి రెండో రాజధాని చేయాలని ఆలోచన చేస్తోంది.

2024 వరకు ఏపీ ..తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం ద్వారా అటు తాము హైదరాబాద్ కోల్పోయామనే భావనలో ఉన్న ఏపీ ప్రజల్లోనూ సానుకూలత వస్తుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ ను తెలంగాణ రాజధానిగా కొనసాగిస్తూనే..కేంద్రం పెత్తనం కొనసాగేలా గ్రేటర్ పరిధి వరకు కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కేంద్ర వర్గాల్లో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

అయితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే దానిని కేసీఆర్ రాజకీయంగా అనుకూలంగా మలచు కొనే అవకాశం ఉంటుందని, అలా కాకుండా యధాతధంగా తెలంగాణ రాజధాని స్టేటస్ కొనసాగిస్తూనే, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఇలా చేయడం ద్వారా అటు తెలంగాణ ప్రజలకు ఇబ్బంది ఉండదు, అలాగే దేశ నలు మూలల నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిర పడిన ప్రజల మద్దతుకూడా ఉంటుంది. దీని ద్వారా రాజకీయంగా టీఆర్ఎస్, హైదరాబాద్ లో ఆధిపత్యం చెలాయిస్తున్న మజ్లిస్ పార్టీకి చెక్ పెట్టవచ్చన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది.

కాగా, గతంలో ఉమ్మడి ఏపీ విడిపోయెప్పుడు హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ దీనికి తెలంగాణలో రాజకీయ పార్టీలు అంగీకరించలేదు. టీఆర్ఎస్ తో పాటుగా కాంగ్రెస్ ఎంపీలు.. ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. దీంతో..కేంద్రం నాడు ఆ ప్రతిపాదన రద్దు చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తెలివిగా రాజధాని హోదా ఉంటూనే కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ఆలోచన లో ఉంది. మరి దీనికి తెలంగాణలో పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.