తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కథానాయకుడు, నిర్మాత అయిన మోహన్ బాబు చెప్పిన మాటలు కొన్ని చర్చకు తావిస్తున్నాయి. తాను బీజేపీ మనిషి అని చెప్పడంతో ఆయన ఏ మేరకు సానుకూల సంకేతాలు ఇస్తున్నారు అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. శ్రీ విద్యా నికేతన్ సంస్థల అధినేతగా ఉన్న మోహన్ బాబు ఎప్పటి నుంచో ఫీజు రీ ఇంబర్స్ మెంట్ తగాదాల్లో ఉన్నారు. ఆయనకు రావాల్సిన డబ్బులు సంబంధిత ప్రభుత్వం చెల్లించడం లేదు. గతంలోనూ ఇదేవిధంగా ఆయన ఇబ్బందుల్లోపడ్డారు. చంద్రబాబు ఆయనకు సన్నిహితుడే అయినా సాయం చేయాల్సి ఉన్నా చేయలేదు అన్న వాదన కూడా ఉంది. అటు పై ఇంటి చుట్టం జగన్ మోహన్ రెడ్డి కూడా ఆయన ఆర్థిక కష్టాలను అర్థం చేసుకుని ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు అన్న వాదనలకూ కొన్ని ప్రకటనలు రుజువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాను బీజేపీ మనిషిని అని చెప్పడంతో జగన్ ను దార్లోకి తెచ్చుకునే పని ఏమయినా చేస్తున్నారా ? అన్న సందేహం కూడా వినిపిస్తోంది.
ఇప్పటికే సినీ నిర్మాణం దాదాపుగా వద్దనుకుంటున్న మోహన్ బాబు, ఇకపై కేవలం విద్యా సంస్థలకే పరిమితం అవ్వాలన్న యోచనలో ఉన్నారు. సినిమా రంగంలో తీవ్ర నష్టాలు చవిచూసిన ఆయన ఒకనాటి వైభవం రావడం కోసం ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో ఆయన సినిమా నిర్మాణం వద్దనుకునే ఉన్నారు. వెబ్ మీడియాలో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టాలని మంచు లక్ష్మీ లాంటి వారు ప్రయత్నించినా అవి కూడా సఫలీకృతం కాలేదు. దాంతో ఇవాళ మంచు కుటుంబం కాస్తో కూస్తో రాణిస్తున్న రంగం విద్యారంగమే ! అందుకే ఆ రంగంలో తమకు ఉన్న ఒడిదొడుకుల నుంచి బయటపడేందుకు మోడీతో ఉన్న పరిచయాలను వాడుకోవాలని చూస్తోంది. ఆ మేరకు నేను బీజేపీ మనిషిని అని మోహన్ బాబు చెప్పి కొంత ఊరట పొంది ఉండవచ్చు.మరోవైపు అరవింద్ ఆహా (ఓటీటీ) లో మంచు లక్ష్మీతోనే ఓ షో కోసం ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది. ఆ విధంగామోహన్ బాబు కుటుంబానికి ఆర్థికంగా ఊతం ఇచ్చేందుకు మెగాస్టార్ కుటుంబం సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే ఆహాలో ఓ షో కు యాంకరింగ్ కూడా చేశారు మంచు లక్ష్మి. బాలయ్య చేసిన తరహాలోనే టాక్ షో ఒకటి చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో అయితే అరవింద్ అనే మెగా ప్రొడ్యూసర్ ఉన్నారు అన్నది ఓ ప్రాథమిక సమాచారం. ఇప్పటికే ఓ కుకరీ షో ను మంచు లక్ష్మీతో ఆహా ఓటీటీ సంస్థ చేసింది. ఆహా భోజనంబు పేరుతో ఆ షో రన్ చేశారు.