ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా..

-

తన ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్‌ పార్టీని వీడనని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని వీడుతున్నట్లు వస్తున్న కథనాలకు ఆయన స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ మూలంగానే నేను ఈ స్థాయిలో ఉన్నానని పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పుంజుకుందని.. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

పీసీసీ పదవి భర్తీలో జరిగిన జాప్యంతోనే పార్టీలో స్తబ్దత నెలకొని కొంతమంది పార్టీని వీడుతున్నారన్నారు. పీసీసీ పదవి సీనియర్లకు ఇస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మనుగడు ఉంటుందన్నారు. ఎన్నికల పేరుతో మరింత కాలయాపన చేస్తే పార్టీకి మరింత నష్టం జరిగేందుకు ఆస్కారం ఉంటుందని, ఈ విషయమై పార్టీ అధిష్టానానికి విన్నవిస్తానన్నారు.

‘వారిద్దరూ జైలుకెళ్లడం ఖాయం’

అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌ నియోజకవర్గాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందని .. మిగతా ప్రాంతాలను విస్మరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి అంతగా బలం లేదని టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీనిచ్చేది కాంగ్రెస్‌ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ జైలుకెళ్లడం ఖాయమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news