మహబూబాబాద్ ఎమ్మెల్యే మరోసారి వివాదంలోకి వచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ సాక్షిగా టీఆర్ఎస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఈరోజు జిల్లా కేంద్రాల్లో జరిగిన రైతు దీక్ష వేదికగా విభేదాలు బయటపడ్డాయి. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు అవమానం జరిగింది. రైతు దీక్షలో జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ నేను మాట్లాడుతా… అంటూ కవిత దగ్గర నుంచి మైక్ లాక్కుని మాట్లాడారు. నేను మాట్లాడుతున్నా కదా అని ఎంపీ అన్నా కూడా శంకర్ నాయక్ వినిపించుకోలేదు. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయిన ఎంపీ అక్కడే కింద కూర్చొని ఉన్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు కు చెప్పారు. మరోవైపు మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధ్యక్షతన అంటూ ప్రసంగించారు. అయితే అక్కడే ఉన్న ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా అధ్యక్షురాలు కవిత అధ్యక్షతన అని చెప్పాలంటూ సూచించారు.
గతంలో కూడా శంకర్ నాయక్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హోలీ సందర్భంగా తన కార్యకర్తలకు బహిరంగంగా నోట్లో మద్యం పోస్తున్న వీడియో వైరల్ అయింది. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. అంతకుముందు కలెక్టర్ తో దురుసుగా వ్యవహరించాడు. ఆ సమయంలో కూడా శంకర్ నాయక్ పై విమర్శలు వచ్చాయి.