నేడు మునుగోడు అభ్యర్థిని ప్రకటించనున్న టీఆర్ఎస్

మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని అధికార టీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఇవాళ ప్రకటించనుంది. ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభాకర్ రెడ్డికి బీ-ఫారం అందజేయనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ వేసేందుకు మంచి రోజు చూసుకోవాలని ఇప్పటికే ప్రభాకర్ కు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.

నేడు విజయదశమి పండుగను పురస్కరించుకొని జాతీయ పార్టీ ప్రకటన ప్రక్రియ పూర్తి కాగానే టీఆర్ఎస్ యంత్రాగం మునుగోడుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనుంది. మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యే ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించనున్నారు. కేటీఆర్, హరీశ్‌ రావు సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ బాధ్యతలు కేటాయించారు. రేపట్నుంచి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నారు.

మునుగోడులో ఇప్పటికే భారీ బహిరంగ సభ నిర్వహించిన సీఎం కేసీఆర్​.. త్వరలో చండూరులోనూ మరో భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు. ప్రచారం ముగిసే సమయానికి ఒకటి, రెండ్రోజుల ముందు సభ నిర్వహించాలని భావిస్తున్నారు. సీపీఐ, సీపీఎంలతో సమన్వయం చేసుకుంటూ వామపక్షాల ఓట్లన్నీ కచ్చితంగా టీఆర్ఎస్ కు పడేలా వ్యూహాలు రచిస్తున్నారు.