తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు నియోయకవర్గం అనేది ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు వాడివేడిగానే సాగుతాయి. ఇక మొన్న ఆ మధ్య ఉపఎన్నికతో మరింత హీట్ పెరిగింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మునుగోడు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈ సారి ఎవరు పోటీలో ఉంటారో అర్ధం కాకుండా ఉంది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే.
మధ్యలో ఆయన కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజేపిలోకి వెళ్లారు. దీంతో ఉపఎన్నిక వచ్చింది. ఉపఎన్నికలో బిఆర్‌ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. బిజేపి నుంచి కోమటిరెడ్డి పోటీ చేసి 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేసి 23 వేల ఓట్లు తెచ్చుకున్నారు. మరి ఈ సారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి ఆల్రెడీ కూసుకుంట్ల ఫిక్స్ అయ్యారు. అయితే కోమటిరెడ్డి బిజేపిలో పెద్దగా యాక్టివ్ గా లేరు.
బిజేపికి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆలోచనలో పడ్డారు. పైగా తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కానీ బిజేపి మాత్రం తమ అభ్యర్ధిగా కోమటిరెడ్డినే అనుకుంటుంది. అటు కాంగ్రెస్ నుంచి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి రేసులో ఉన్నారు. ఉపఎన్నికలో స్రవంతికి ఛాన్స్ ఇచ్చారు..కాబట్టి ఈ సారి తనకు ఛాన్స్ ఇవ్వాలని కృష్ణారెడ్డి అంటున్నారు.
అటు కమ్యూనిస్టులు మునుగోడులో బలంగానే ఉన్నారు. ఉపఎన్నికలో బిఆర్‌ఎస్ గెలవడానికి కారణమే కమ్యూనిస్టులు. కానీ ఇప్పుడు వారిని కేసిఆర్ పక్కన పెట్టారు. దీంతో కాంగ్రెస్ తో కలిసేందుకు కమ్యూనిస్టులు చూస్తున్నారు. అదే జరిగితే పొత్తులో సిపిఐ మునుగోడు సీటు అడిగే ఛాన్స్ ఉంది. లేదా కాంగ్రెస్ లోకి కోమటిరెడ్డి వస్తే మళ్ళీ సీన్ మారుతుంది. చూడాలి మరి మునుగోడులో ఈ సారి ఎవరు గెలుస్తారో.