మైనంపల్లి వర్సెస్ బండి: ప్రజలకు కావాల్సింది ఇదేనా!

రాజకీయాల్లో నాయకులు విలువలు పాటిస్తూ, ప్రత్యర్ధులపై నిర్మాణాత్మకమైన విమర్శల చేస్తూ రాజకీయం చేయాలి. అప్పుడే ప్రజలు సైతం అలాంటి నాయకులని గౌరవిస్తారు. మరి ప్రజల మైండ్ సెట్ మారిందో లేక నాయకుల మైండ్ సెట్ మారిపోయిందో తెలియదుగానీ, ఇప్పుడు బూతులు మాట్లాడనిదే రాజకీయాలు ఉండటం లేదు. నాయకులు ఒకరిని ఒకరు అసభ్యపదజాలంతో దూషించుకుంటూ ఉండాలి. అంటే ఎవరు ఎంత ఎక్కువగా తిడితే  వారే గొప్ప అన్నట్లు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం నడుస్తోంది.

నాయకులు బూతుల మాట్లాడలేనిదే ఉండలేకపోతున్నారు. ఒకప్పుడు అధికార, ప్రతిపక్ష నాయకులు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకునేవారు. వ్యక్తుల పరంగా కాకుండా, అంశాల వారీగా విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేసుకుంటున్నారు. పైగా ఒక నాయకుడు అసభ్యపదజాలంతో ప్రత్యర్ధి నాయకుడుని దూషిస్తుంటే, సొంత పార్టీ వాళ్ళు బాగా ఆనందపడుతున్నారు. ‘అబ్బా మా నాయకుడు భలే తిట్టాడని సంబరపడుతున్నారు’.

ఇక ఇలాంటి పరిస్తితి రెండు రాష్ట్రాల్లోనూ ఉంది. అధికార, ప్రతిపక్షాలు అనే తేడా లేకుండా నాయకులు తిట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, బీజేపీ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల మధ్య ఎలాంటి విమర్శల పర్వం నడిచిందో అందరికీ తెలిసిందే.

తమ కార్పొరేటర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అనుచరులు దాడి చేశారని చెప్పి బండి దూకుడు ప్రదర్శించారు. ఎమ్మెల్యే మైనంపల్లిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక అటు మైనంపల్లి కూడా వెనక్కి తగ్గకుండా బండిపై దారుణమైన విమర్శలు చేశారు. అసలు ఒక ఎంపీ, ఎమ్మెల్యేఅని స్థాయిని మరిచిపోయి, వీధి రౌడీల బాషని ఉపయోగించారని చెప్పొచ్చు.

ప్రజాప్రతినిధులుగా ఉన్న వీరే ఇలా మాట్లాడి, సామాన్య ప్రజలకు ఏం చెబుతున్నారని రాజకీయ పరిశీలకులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికైనా రాజకీయాల్లో ఇలాంటి బాషని ప్రజలు అంగీకరించరని చెబుతున్నారు.