ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పై పోటీ చేయమంటే చేస్తానని ఆలీ చేసిన ప్రకటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జగన్ ఆదేశిస్తే..పవన్ పై పోటీ చేస్తానని ఆలీ ప్రకటించారు. దీంతో ఆలీపై జనసేన శ్రేణులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి..దమ్ముంటే జనసేన కార్యకర్తపై పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. ఇలా ఆలీ ప్రకటనపై రచ్చ జరుగుతున్న సందర్భంలో..ఈ అంశంపై నాగబాబు స్పందించారు. ఆలీ పోటీ చేస్తానని ప్రకటనపై నో కామెంట్ తేల్చి చెప్పేశారు. అంటే ఆలీపై కామెంట్ చేయడానికి నాగబాబు టైమ్ వేస్ట్ చేసుకోరు అని జనసేన సేనులు అంటున్నాయి.
ఇక అటు టీడీపీ-జనసేన పొత్తుపై ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అని తెలుస్తోంది. వీరితో పాటు బీజేపీ కలిసొస్తుందా? లేదా? అనేది తర్వాత విషయం. బీజేపీ దాదాపు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి అంగీకరించడం లేదు. అలాంటప్పుడు జనసేన..బీజేపీని వదిలేయాల్సిన పరిస్తితి ఉంది. ఇలా పొత్తులపై ప్రచారం జరుగుతున్న తరుణంలో నాగబాబు పొత్తు అంశంపై స్పందించారు.
పొత్తులపై తుది నిర్ణయం పవన్ కల్యాణ్‌దే అని, ఆయన ఎలా ముందుకెళితే తాము అలాగే వెళ్తామని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లాలో మహిళా నేతల సమావేశంలో నాగబాబు ఈ ప్రకటన చేశారు. పొత్తులు లేకుండా ఉంటే కర్నూలు జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని, పొత్తులు ఉంటే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముందుకు వెళతామని చెప్పుకొచ్చారు. అయితే పొత్తులపై నాగబాబుకు కూడా ఒక క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో ఆయన..ఈ విధంగా పొత్తుల అంశం పవన్ చూసుకుంటారని చెప్పినట్లు తెలుస్తోంది.