సీనియ‌ర్ ఎన్టీఆర్ స్టైల్లో లోకేష్ తాజా రాజ‌కీయం

-

ఏపీ రాజ‌కీయాల్లో త‌క్కువ కాలంలో ఎక్కువ ఇమేజ్ స‌హా ప‌ద‌వులు కూడా సంపాయించుకున్న రాజ‌కీయ వార‌సుడు నారా లోకేష్ బాబు. ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడిగా రంగ ప్ర‌వేశం ప్ర‌వేశం చేసిన లోకేష్ విదేశాల్లో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించాడు. కొన్నాళ్లు సొంత సంస్థ హెరిటేజ్‌ను చూసుకున్నారు. అయితే, అనూహ్యంగా రాష్ట్ర విభ‌జ‌నకు ముందు చంద్ర‌బాబు నిర్వ‌హించిన వ‌స్తున్నామీకోసం యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల‌ను ఏక‌తాటిపై న‌డిపించే బాధ్య‌త‌ను తెర‌చాటు నుంచే చూసుకున్న లోకేష్‌, ఇక‌, 2014 ఎన్నిక‌ల స‌మ‌యానికి పార్టీలో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. ఐటీపై ప‌ట్టున్న లోకేష్‌.. అప్ప‌టి వ‌ర‌కు రాత పూర్వ‌కంగా సాగుతున్న స‌భ్య‌త్వాలు, కార్య‌క‌ర్త‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను డిజిలైజేష‌న్ చేయ‌డం ప్రారంభించారు.

అదేస‌మ‌యంలో నేత‌ల‌పై నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాలు తెలుసుకోవ‌డం వంటి కీల‌క విష‌యాల‌పై దృష్టి పెట్టారు. ఈ విష‌యంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. అంతేకాదు, త‌న పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు మ‌రింత డెడికేటెడ్‌గా ఉండాలంటే.. వారికంటూ కొంత భ‌రోసా ఉండాల‌ని భావించిన లోకేష్ ఈ క్ర‌మంలోనే వారికి ఇన్‌స్యూరెన్స్‌ను ప్ర‌వేశ పెట్టారు. రూ.100 తో పార్టీ స‌భ్య‌త్వం తీసుకున్న కార్య‌క‌ర్త‌లకు ఇన్‌స్యూరెన్స్ వ‌ర్తించేలా చేశారు. ఇది కూడా బాగా సక్సెస్ అయింది. దీంతో పార్టీకి కొత్త ఊపు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఆయ‌న‌ను ఎమ్మెల్సీగా చేసి వెంట‌నే 2017లో త‌న మంత్రివ‌ర్గంలోకి తీసుకుని రెండు కీల‌క శాఖ‌ల‌ను అప్ప‌గించారు. స‌రే! ఇదంతా అంద‌రికీ తెలిసిందే.

అయితే,లోకేష్ పార్టీలో పుంజుకునే విష‌యంలోనూ, త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే విష‌యంలోనూ కొన్నాళ్లు త‌న తండ్రిని అనుస‌రించారు. త‌న తండ్రి మాదిరిగానే `అలా ముందుకు వెళ్తాం..` `త‌మ్ముళ్లూ“ అంటూ త‌న హావ భావాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ముఖ్యంగా తాజాగా ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసిన సంద‌ర్భంలో ఎక్కువ‌గా ఈ డైలాగు ల‌ను వండి వార్చారు. అయితే, ఇవి పెద్ద‌గా హిట్ కాలేదు. దీంతో లోకేష్ ట‌ఫ్ ఫైట్ ఇచ్చిన‌ప్ప‌టికీ.. ఓట‌మిపాల‌య్యారు. అయినా.. తొలి ఓట‌మితో ఆయ‌న కుంగి పోకుండా ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. అదేస‌మ‌యంలో ఇటీవ‌ల రెండు వారాలుగా ఆయ‌న కొత్త పంథాను అనుస‌రిస్తున్నారు. త‌న తాత‌, టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, అన్న‌గారు ఎన్టీఆర్‌ను అనుక‌రించ‌డం మొద‌లు పెట్టారు.

ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన స‌మ‌యంలో త‌ర్వాత కూడా త‌న ఎడ‌మ చేతిని గాలిలోకి ఊపి.. ప్ర‌జ‌ల‌తో క‌లిసి పోయేవారు. ఈ త‌ర‌హా అభినివేశం బాగా వ‌ర్క‌వుట్ అయింది. అదేస‌మ‌యంలో ఆయ‌న న‌వ్వుతూనే అంద‌రినీ ప‌ల‌క‌రించేవారు. దీంతో అత్యంత వేగంగా అన్న‌గారు అంద‌రికీ మ‌న వాడు అనే భావ‌న కల్పించారు. అయితే, గ‌తంలోనే ఆయ‌న సీనియ‌ర్ న‌టుడు, హీరో కావ‌డంతో ఈ రెండు కూడా ఆయ‌న‌కు మ‌రింత బాగా క‌లిసివ‌చ్చాయి. ఇప్పుడు లోకేష్ త‌న తాత త‌ర‌హాలో ఎడ‌మ చేతిని గాలిలోకి ఊపుతూ.. అంద‌రితో చిరున‌వ్వు చిందిస్తూ.. ప‌ల‌క‌రిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ హావ భావాల‌కు సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. తండ్రి పోయి.. తాత‌ను అనుకరిస్తున్న లోకేష్ అంటూ కామెంట్లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ రకంగా అయినా.. లోకేష్ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news