విజ‌య‌సాయి అత్యుత్సాహం వైసీపీకి దెబ్బేస్తోందిగా…!

-

రాజ‌కీయాలు చేయ‌డం అంటే.. నోటికి వ‌చ్చింది మాట్లాడేయ‌డం కాదు! బ‌హుశ రాజ‌కీయాల్లో ఉన్న నాయకుల‌కు ఈ విష‌యం తెలియంది కాదు. అయినా కూడా చాలా మంది నాయ‌కులు త‌మ నోటికి తాళం వేసుకోలేక పోతున్నారు. అత్యుత్సాహంతో కామెంట్లు చేస్తూ.. పార్టీని, త‌మ‌ను కూడా అభ‌ద్ర‌తాభావంలో ప‌డేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉన్నారు వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. ఆడిట‌ర్‌గా ఉంటూ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సాయిరెడ్డి.. అనూహ్యంగా వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆవెంట‌నే రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల‌ను అందిపుచ్చుకున్నారు. అంతేకాదు, ఉత్త‌రాంధ్ర జిల్లాల పార్టీ ఇంచార్జ్ గా కూడా ఉన్నారు.

అయితే, ఈయ‌న‌కు ఇన్ని ప‌ద‌వులు వ‌చ్చిన ఆనందంలోనో.. లేక త‌ను ఏం మాట్లాడినా.. తిరుగేలేద‌ని అనుకుంటున్నందునో తెలియ‌దు కానీ, సాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌లు.. ఎప్ప‌టిక‌ప్పుడు వివాదంగా మారుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి చేసిన దిశానిర్దేశ‌పు ప్ర‌సంగాలు వివాదాల‌కు కార‌ణ‌మ‌య్యాయి. సీనియ‌ర్‌గా ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేయ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. అది విజ‌య‌సాయి బాధ్య‌త కూడా. అయితే,ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌నసులో ఏమీ దాచుకోకుండా చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో పార్టీ ఇరుకున ప‌డుతోంది.

అప్ప‌ట్లో ఆయ‌న మాట్లాడుతూ.. “అన్నీ సెట్ చేసేశాం. గెలుపు మ‌న‌దే. అయితే, చంద్ర‌బాబును న‌మ్మ‌రాదు. ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్‌లో ఏమైనా చేస్తాడు“ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో తీవ్ర దుమారం రేపాయి. అదేస‌మ‌యంలో మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావు.. అప్ప‌ట్లో పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌ను క‌లిసిన‌ప్పుడు కూడా ఇంకేముంది సాంబ‌శివ‌రావు పార్టీలో చేరిపోతున్నాడంటూ.. ప్ర‌చారం చేశారు. వెంట‌నే రంగంలోకి దిగిన సాంబ‌శివ‌రావు.. తూచ్ తాను పార్టీలో చేరేది లేద‌ని చెప్ప‌డంతో సాయిరెడ్డి ప‌రువు పోయింది.

ఇటీవ‌ల రివ‌ర్స్ టెండ‌రింగుల విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై కేంద్రం విరుచుకుప‌డుతున్న స‌మ‌యంలో “మేం ఏం చేసినా.. కేంద్రానికి చెప్పే చేస్తున్నాం“ అంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఇది కూడా తీవ్ర వివాదానికి కార‌ణ‌మై.. ఏకంగా కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని వివ‌ర‌ణ కోరే వ‌ర‌కు విష‌యం వ‌చ్చింది. ఇలా సాయిరెడ్డి త‌న‌ను తాను అదుపు చేసుకోలేక పోతున్నారు.
తాజాగా కూడా ఆయ‌న మ‌రో వివాదంలో వేలు పెట్టి రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రువును బ‌జారున ప‌డేశారు.

జ‌గ‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న గ్రామ స‌చివాల‌య ఉద్యోగాల‌కు సంబంధించి సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ర‌గ‌డ సృష్టిస్తున్నాయి. “వలంటీర్లుగా 90 శాతం మంది వైసీపీ కార్యకర్తలనే తీసుకున్నాం. గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగాల్లో మన కార్యకర్తలు చాలా మంది సెలక్ట్‌ అయ్యారు’` అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మ‌రి ఇది నిజ‌మేనా? అయితే, జ‌గ‌న్ రాజీనామా చేయాల‌నే డిమాండ్లు ఊపందుకున్నాయి. మ‌రి ఇలాంటి వివాదాల‌కుకార‌ణ‌మ‌వుతున్న సాయిరెడ్డిని అదుపు చేస్తేనే మంచిద‌నే డిమాండ్లు వైసీపీలోనే వినిపిస్తున్నాయి. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news