వైసీపీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ… వైసీపీ తరుపున ప్రచారం చేస్తారా?

-

వైఎస్ జగన్ మోహ‌న్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు. జగన్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నానన్న నార్నె.నార్నె తో పాటు కిల్లి కృపారాణి కూడా వైసీపీ లో చేరారు.

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి ముఖ్య నేతలు వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస రావు వైసీపీలో చేరారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నార్నె తో పాటు కిల్లి కృపారాణి కూడా వైసీపీ లో చేరారు.

పదేళ్లుగా వైఎస్ కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఉంది. నేను వైసీపీలో చేరడానికి… జూనియర్ ఎన్టీఆర్ కు ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా నా సొంత నిర్ణయం. దీనికి… ఎన్టీఆర్ కు ఎటువంటి సంబంధం లేదు. నేను ఏ టికెట్ కూడా ఆశించి పార్టీలో చేరలేదు. ఒకవేళ జగన్ టికెట్ ఇస్తే పోటీ చేస్తా. జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే నా కోరిక. అందుకే పార్టీలో చేరా…అని నార్నె తెలిపారు.

నార్నే శ్రీనివాస రావు రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటారు. 2014 లో కూడా ఆయన వైసీపీ లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన అప్పుడు వైసీపీలో చేరలేదు. తాజాగ ఆయన వైసీపీలో చేరడంతో వైసీపీ బలం పెరిగినట్టే. అంతే కాకుండా ఆయన జూనియర్ ఎన్టీఆర్ మామ… చంద్రబాబుకు కూడా బంధువే. నార్నే కూతురు లక్ష్మీ ప్రణతి తో జూనియర్ వివాహాన్ని చంద్రబాబే కుదిర్చారని చెబుతుంటారు. గత పది రోజుల కిందట కూడా నార్నే… జగన్ ను కలిశారు. అప్పుడే అయన వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది కానీ జగన్ ను మర్యాద పూర్వకంగానే కలిసినట్టు నార్నే చెప్పారు. నార్నే గతంలో స్టూడియో ఎన్ అనే ఛానెల్ ను నడిపారు.

గుంటూరు జిల్లా నుంచి పోటీ?

మరో వైపు నార్నె గుంటూరు జిల్లాలోని ఏదో ఒక నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్ గుంటూరు జిల్లాలో ఓ సీటును నార్నె కు కేటాయించనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా వైసీపీ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆయన వైసీపీ తరుపున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news