రాజమండ్రి: ‘అవసరమైతే ఓడిపోవడానికి సిద్ధమే గానీ… నా ఐడియాలజీ మార్చుకోను’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. ‘ప్రజా పోరాట యాత్ర’లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తనకు కులాన్ని ఆపాదిస్తూ దగుల్భాజి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అలగాజనం, సంకరజాతి అంటూ బాలకృష్ణ కించపరుస్తున్నారని దుయ్యబట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాళ్ళు పట్టుకున్న చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరెత్తే హక్కులేదని, ఎన్టీఆర్ విగ్రహాలకు ముసుగులేయాలని పవన్ వ్యాఖ్యానించారు. నైతికత విషయంలో తాను అందరికన్నా ఉన్నతుడిని చెప్పుకొచ్చారు. తనకు ప్రతి ఒక్కరి జీవితాలు తెలుసని, అందరి జీవితాలు బయటపెట్టగలని హెచ్చరించారు. తనను, తన తల్లిని తిట్టడానికే కార్యక్రమాలు చేస్తున్నారని, అధికారంలో చంద్రబాబు, విపక్షంలో జగన్ ఫెయిల్ అయ్యారని పవన్ ఆరోపించారు.