సంక్రాంతికి ముందే ఏపీలో మరో ఎన్నికల సందడి మొదలుకానుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పచ్చజెండా ఊపింది. డిసెంబరు 15 నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10 న రిజర్వేషన్ల జాబితాను ఖరారు చేయాలనీ ఆదేశించారు. దాంతో జనవరి 11 తేదీనుంచి పంచాయితీ ఎన్నికల కోడ్ అమలవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు. సాధారణంగా సంక్రాంతికి పల్లెల్లో సందడిగా ఉంటుంది. అయితే ఈసారి సంక్రాంతికి పంచాయితీ ఎన్నికలతో మరింత సందడి ఏర్పడనుంది.
కాగా పంచాయితీ ఎన్నికల కోసం అన్ని పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. ఇటు గ్రామాల్లో సర్పంచ్ కి పోటీ చెయ్యాలని ఉవిళ్లూరుతున్న కార్యకర్తలు ఎమ్మెల్యేలు, నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. పంచాయితి ఎన్నికలకు పూర్తిస్థాయిలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ సిద్ధమయ్యాయి. జనసేన నుంచి ఇప్పటివరకు ప్రకటన వెలువడలేదు. సంస్థాగతంగా బలపడేందుకు టీడీపీ గ్రామకమిటీలను వేస్తోంది. డిసెంబర్ 15 లోపు కమిటీల ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది.. ఆ తరువాతే ప్రచారం నిర్వహించాలని సిద్ధమవుతోంది.