“మనుషులు కష్టాల్లో ఉన్నారు.. మనుషులు కన్నీళ్లలో ఉన్నారు. దేవుడు రాడు.. దేవుడు తన తరఫున కొందరికి పురమాయిస్తాడు.. ఆవిధంగా సాయం అందించేందుకు తన తరఫు మనుషులను పంపిస్తాడు. అలాంటి సాయం ఎవ్వరు అందించినా ఆనందించాలి” అని అంటోంది జనసేన. తమకు రాజకీయ రంగులు అంటివద్దని వేడుకుంటోంది. వీలుంటే ఈ సమస్యను ప్రభుత్వ పెద్దలు వీలున్నంత వేగంగా పరిష్కరించాలని చేతులు జోడించి మరీ ! ప్రార్థిస్తూ కౌలు రైతు భరోసా యాత్రను ఇవాళ సీమ దారుల్లో కొనసాగిస్తోంది.
“ఆత్మహత్య అన్నది ఎంతటి భయంకరమైన పనో నాకు తెలుసు. నేను అలాంటి సిట్యువేషన్ నుంచి వచ్చిన వాడినే ! మీరు అధైర్య పడకండి.. నేను మీ వెంటే ఉంటాను.. మీ కష్టంలో తోడుంటాను.. నాకు రాజకీయాలతో పని లేదు. నేను చేయదగినంత సాయం చేసి వెళ్తాను.. అని చెబుతూ ఉన్నారు జనసేనాని పవన్ కల్యాణ్.. ఆయన వెంటే నడుస్తున్నారు కార్యకర్తలు. మీరు గుర్తించండి ఎవ్వరైనా ఆత్మ హత్య చేసుకుందాం అని సిద్ధపడితే నా దృష్టికి తీసుకురండి.. నేను వాళ్లకు చేతనైనంత సాయం చేసి, నా వంతుగా వారికి అండగా ఉంటాన”ని చెప్పారాయన. ఇప్పుడు అవే మాటలకు కొనసాగింపుగా ఇవాళ కర్నూలుకు విచ్చేశారు.
ఆ వివరం ఈ కథనంలో..
ఉమ్మడి కర్నూలు జిల్లా నంధ్యాలలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన అక్కడ కౌలు రైతు భరోసా యాత్రను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ రోజు నిర్ణయించిన కార్యక్రమంలో భాగంగా 130 కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున అందించి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. అదేవిధంగా వారి బాగోగులు అడిగి తెలుసుకోనున్నారు.
ఇప్పటికే ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలలో పవన్ పర్యటించి బాధితులకు తనవంతు సాయం చేసి వచ్చారు. వీటిపై ఎన్ని రాజకీయ విమర్శలు వచ్చినా తాను మాత్రం అనుకున్నది చేసే తీరుతానని పవన్ స్పష్టం చేస్తూ ఉన్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల దీన గాధ తనకు తెలుసు అని, అందుకే తన వంతుగా ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నానని, దీనికి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించవద్దని పదే పదే విన్నవిస్తున్నారాయన.
ఇవాళ ఆయన పలువురిని కలిసి, వారి బాధలు తెలుసుకుని, ఇకపై ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చేయాలో అన్నది మరోసారి పార్టీ నాయకులతో చర్చేందుకు వీలుంది. ఇప్పటికే వీరి కోసం ఓ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారు.ఇందుకు అవసరం అయ్యే నిధులలో యాభై శాతం తానే భరిస్తానని కూడా ప్రకటించారు. మిగతా యాభై శాతం పార్టీ పెద్దలు, ఇతర నాయకులు, కార్యకర్తలు కలిసి భరిస్తారని కూడా చెప్పారు.