ఎన్నికల ఫలితాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

టీడీపీ, వైసీపీలా జనసేన పార్టీ సీట్ల లెక్కను వేయదని ఆయన స్పష్టం చేశారు. జనసేనకు అన్ని సీట్లు వస్తాయి.. ఇన్ని సీట్లు వస్తాయి అని తాను చెప్పను అంటూ స్పష్టం చేశారు.

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. కానీ ఫలితాలు మాత్రం మే 23న వస్తాయి. అప్పటి దాకా రాజకీయ నాయకులు ఖాళీగా కూర్చోరు కదా. మా పార్టీ అంటే మా పార్టీ గెలుస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. అయితే.. ఎన్నికల పూర్తయ్యాక జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం ఏం స్పందించలేదు. ఎన్నికల తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. ఎక్కడికెళ్లారో తెలియదు. అయితే.. ఎన్నికల పూర్తయిన 10 రోజుల తర్వాత పవన్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

టీడీపీ, వైసీపీలా జనసేన సీట్ల లెక్క వేయదు..

ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్… టీడీపీ, వైసీపీలా జనసేన పార్టీ సీట్ల లెక్కను వేయదని ఆయన స్పష్టం చేశారు. జనసేనకు అన్ని సీట్లు వస్తాయి.. ఇన్ని సీట్లు వస్తాయి అని తాను చెప్పను అంటూ స్పష్టం చేశారు. అయితే.. జనసేన ఏదైతో చెప్పిందో అదే మార్పు మొదలైంది. దాన్నే కొనసాగిద్దాం. మార్పు ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుంది. అయితే ఆ మార్పు ఎంతదూరం వెళ్తుందో మాత్రం తెలియదు.. అని పవన్ స్పష్టం చేశారు.

ఏపీ అసెంబ్లీ అభ్యర్థులతో పవన్ సమావేశం

గుంటూరులోని జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ అభ్యర్థులతో పవన్ సమావేశం అయ్యారు. ఈసందర్భంగా పవన్ ఎన్నికల్లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు లేకున్నా ప్రజలతో మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఎప్పుడూ పని చేయాలని అభ్యర్థులకు పవన్ సూచించారు. పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాలని, గ్రామ స్థాయి నుంచి కొత్త తరం నాయకులు పుట్టుకురావాలని తెలిపారు.

త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే మార్పును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తెలంగాణలోనూ ఇదే తరహా మార్పు రావాలని.. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామానికి ఒక రోజు కేటాయించండి. అందరినీ కలవండి. స్థానికుల సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా పనిచేయండి. ఒకవేళ పెద్ద సమస్య ఉంటే నేను స్పందిస్తా.. అని పవన్ తెలిపారు.