పంచాంగం అంటే తెలుసా..!

ఉగాది వచ్చిందంటే చాలు… పంచాగ శ్రవణాలు. నూతన సంవత్సర ఫలాలు. అన్ని పేపర్లు, టీవీ చానెళ్లు హోరెత్తిపోతాయి. అసలు పంచాంగం అంటే ఏమిటో మీకు తెలుసా! అత్యాధునిక సాంకేతిక లేని సమయంలో ఎక్కడో మారుమూల కుగ్రామంలో జ్యోతిష పండితులు.. సింద్ధాంతులు సూర్య లేదా చంద్ర గమన ఆధారంగా లెక్కలు వేసి గ్రహగమనాలను, కాలాల నిర్ణయాన్ని, గ్రహణాల విషయంతోపాటు మరెన్నో విషయాలను తెలియజేసేదే పంచాంగం.

లేటెస్ట్ టెక్నాలజీ కంటే ఎంతో మెరుగ్గా లెక్కలు వేయడం కేవలం మన భారతీయ జ్యోతిషులకే చెల్లిందనడంలో అతిశయోక్తిలేదు. వర్షాలు, వరదలు, ఎండలు ఇలా సకల రకాల శీతోష్ణస్థితులను, ఉపద్రవాలను సైతం లెక్కించే శాస్త్రం మన భారతీయుల సొంతం. అయితే పంచాంగం అంటే ఏమిటి దాన్ని దీని ప్రాతిపదికన తయారుచేస్తారో తెలుసుకుందాం.

పంచాంగం- పంచ అంటే ఐదు. ఐదు అంగాలతో తయారైందే పంచాంగం. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంశాలే పంచాంగంలోని ఐదు అంగాలు.

ఐదు అంగాలు ఇచ్చే ఫలితాలను పరిశీలిస్తే….

తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్థనం
నక్షత్రాద్హరతే పాపం యోగాద్రోగనివారణం
కరణాత్కార్యసిద్ధిస్తు పంచాంగఫలముత్తమం
కాలవిత్కర్మకఋద్దీమాన్ దేవతానుగ్రహో లభేత్
భావం- తిథి సంపదలను, వారం ఆయుష్యును ఇస్తాయి. నక్షత్రం పాపాలను హరించగా, యోగం రోగాలను నివారిస్తుంది. ఇక చివరిది కరణం విజయాన్ని ఇస్తుంది.
ఇక పైన చెప్పిన ఏది మీకు అవసరమో దాన్ని బట్టి ఆయా అంగాలను చూసుకుని ముందుకుపోతే తప్పక మీరు కోరుకున్నది సిద్ధిస్తుంది.

– కేశవ