“పిల్ల కాంగ్రెస్” ఫెయిల్: “పిల్ల టీడీపీ” పాత్రకు ఫుల్ మార్కులు!

-

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన కొత్తలో టీడీపీ నాయకులు అధికంగా ప్రయోగించిన పదప్రయోగం, వైకాపాకు పెట్టిన పేరు “పిల్ల కాంగ్రెస్” అని. దానికి వారిదగ్గరున్న కారణం… వైకాపాలో అధికంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేతలే అని కాగా.. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లే జగన్ నడుచుకోబోతోన్నారని చెప్పడం కూడా! కాకపొతే అనతికాలంలోనే వైకాపాకు ఆ పేరు పోయింది.. ఎంతలా అంటే.. వైకాపాకు ఆ పేరు పెట్టిన టీడీపీ నేతలే ఆ పేరు మరిచిపోయేలా!

అనంతరం “తల్లి కాంగ్రెస్” తోనే టీడీపీ జతకట్టి “పిల్ల కాంగ్రెస్” పేరును వారే ఓన్ చేసేసుకున్నారు! దీంతో “పిల్ల కాంగ్రెస్” అంటూ వైకాపాపై టీడీపీ నేతలు చేసిన ప్రచారం కాస్తా సున్నా మార్కులతో ఫెయిల్ అయిపోయింది! ఈ సమయంలో తాజాగా “ఏపీ బీజేపీ”కి “పిల్ల టీడీపీ” అనే పేరు సరిగ్గా సూటవుతుందని.. ఈ విషయంలో వారు పోషిస్తోన్న పాత్రకు ఫుల్ మార్కులు వేయొచ్చని కామెంట్లు తాజాగా రాజకీయ వర్గాల్లో చోటుచేసుకుంటున్నాయి!

ఈ రకంగా “ఏపీ బీజేపీ”కి “పిల్ల కాంగ్రెస్” అనే పేరు ప్రస్థావన రావడానికి మూడు కారణాలు ఉండగా… అందులో ఒకటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. గవర్నర్ కు లేఖ రాయడం ! మూడు రాజధానుల బిల్లులను ఆమోదించవద్దంటూ లేఖ రాసిన కన్నా… పరిపాలన వికేంద్రీకరణకు వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం “అందరికీ” ఆమోదయోగ్యం కాదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక్కడ కన్నా చెబుతున్న “అందరూ” ఎవరనేది ఇక్కడ ఒక పాయింట్. ఆ అందరు ఎవరో కన్నా నే చెప్పాలి!! ఎందుకంటే… ఆ అందరిలో ఏపీ బీజేపీ నేతలే పూర్తిగా లేదనేది ఒక బలమైన వాదన!!

ఇక రెండో విషయానికొస్తే… కన్నా రాసిన లేఖపై పార్టీ ముఖ్యులు కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది! బీజేపీకి రాజకీయంగా నష్టం చేకూర్చేలా, తెలుగుదేశం పార్టీ లైన్‌ లో ఈ లేఖ ఉందని.. ఇది రాసేటప్పుడు కనీసం రాష్ట్ర బీజేపీలో కూడా ఎవ్వరినీ సంప్రదించలేదని “ఏపీ బీజేపీ” నేతలు వాపోతున్నారు. తన “సొంత” అభిప్రాయాన్ని “అందరి” అభిప్రాయంగా… తన “వ్యక్తిగత” అభిప్రాయాన్ని “పార్టీ” అభిప్రాయంగా చెబుతూ పార్టీ అధ్యక్షుడి హోదాలో లేఖ రాయడం ద్వారా అది పూర్తిగా పార్టీ అభిప్రాయంగా జనాల్లోకి వెళ్లిపోయిందని బాదపడుతున్నారంట!

ఇక మూడో విషయానికొస్తే… టీడీపీ నేతలు గవర్నర్ కు లేఖ రాసిన కొద్దిసేపటికే కన్నా లక్ష్మీనారాయణ కూడా లేఖ రాశారు. దీంతో ఏపీ బీజేపీని “పిల్ల టీడీపీ”గా మారుస్తున్నారనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లిపోతుందని.. కొందరు ఏపీ బీజేపీ నేతలు కేంద్రంలోని పార్టీ ముఖ్యులకు సమాచారం అందించారంట! ఇప్పటికే ఏపీ రాజధాని విషయంలో కేంద్రంలోని కొందరు పెద్దలు… “అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విషయం..” అని స్పష్టం చేసిన తరువాత కూడా కన్నా లక్ష్మీనారాయణ ఇలా లేఖ రాయడంతో “పిల్ల టీడీపీ” పేరుకు సార్ధకత తీసుకొచ్చేలా ఉన్నారనే కామెంట్లు పడుతున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news