తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్.. పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ధాన్యం కొనుగోలు విషయంలో పీయూష్ గోయాల్ పాత అబద్ధాలనే చెబుతున్నారని విమర్శించారు. అలాగే సభ సాక్షిగా తనను కొందరు ముఖ్య మంత్రులు బెదిరిస్తున్నారని చెప్పడం దారుణమని అన్నారు. గతంలో నరేంద్ర మోడీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారని గుర్తు చేశారు.
అయితే మోడీ కూడా అప్పుడు.. బెదిరించినట్టేనా.. అని ప్రశ్నించారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న పీయూష్ గోయాల్ కు కేంద్ర మంత్రి పదవీలో ఉండే అర్హత లేదని అన్నారు. కేంద్రం రాసుకున్న ఫార్మాట్ లో రాష్ట్రాల నుంచి బలవంతంగా లేఖలు తీసుకుందని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వమే… బలవంతంగా లేఖలు తీసుకుందని ఆగ్రహించారు. భిన్న పరిస్థితులు ఉన్న రాష్ట్రాలకు ఒకే నిబంధనలు విధించి సమానత్వం అని అనండం సరికాదని అన్నారు.