బయోపిక్ ల ట్రెండ్ కొద్ది కాలం నడిచి ఆగిపోయింది. వాస్తవానికి బయోపిక్ లు ఏవీ పెద్దగా పేరు తెచ్చుకోలేదు. పైసలు వసూలు చేసే ప్రాజెక్టులుగా నిలవనూ లేదు. ఇదే క్రమంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసి రామ్ గోపాల్ వర్మ చేతులు కాల్చుకున్నారు. ఇదే ఎన్టీఆర్ కథను సానుకూల వైఖరితో రెండు భాగాలుగా బయోపిక్ తీసి వదిలారు బాలకృష్ణ. ఇవి కూడా ఆకట్టుకోలేకపోయాయి. జయలలిత బయోపిక్ ను ఆ మధ్య కంగనా రనౌత్ తో తీశారు కానీ అది కూడా పేరు తెచ్చుకోలేకపోయింది.
ఇదే జయలలిత కథలో గౌతమ్ మీనన్ చేసిన వెబ్ సిరీస్ మాత్రం భలే ఆకట్టుకుంది. ఈ మొత్తం సిరీస్ లో ఆకట్టుకున్న విషయం ఇదే కావడం గమనార్హం. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర మాత్రం మంచి పేరే తెచ్చుకున్నా ఆ సినిమా కూడా పైసా వసూల్ ప్రాజెక్టు కాలేకపోయింది. ఆఖరికి వైసీపీ శ్రేణులే ఈ సినిమాను ఓన్ చేసుకోలేదు అన్న వాదనలు వచ్చాయి. ఈ దశలో ఎన్నికలకు ముందు కొండా దంపతుల కథతో ఓ సినిమా తీశారు.ఈ మధ్యనే ! ఇప్పుడు మరో సినిమా అంటూ మంట రేపుతున్నారు ఆర్జీవీ.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ తీసేందుకు ముందుకు వచ్చారు. గతంలో కొన్ని నిజ జీవిత ఆధార కథలు రూపొందించి పేరు తెచ్చుకున్నారు.అదేవిధంగా వివాదాలూ కొని తెచ్చుకున్నారు.ఈ సారి ఆయన మనసు తెలంగాణ ఉద్యమ కర్త, ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీయనున్నానని అన్నారు.
ఢిల్లీలో ఈ విషయాన్ని నిన్నటి వేళ ప్రకటించారు. డేంజరస్ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఇక్కడి ఆంధ్రా అసోసియేషన్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా తనకు ఈ కథపై పూర్తి అవగాహన ఉందని, తన బుర్రలో ఇప్పటికే ఇందుకు సంబంధించి ఆలోచనలు ఉన్నాయని, కనుక స్క్రిప్ట్ వర్క్ పెద్ద కష్టమేమీ కాదని అన్నారు.