ప్ర‌బోదానందపై గుత్తిలో కేసు న‌మోదు..

-

  •  మూడేళ్లుగా ఆశ్రమానికి రాని ప్రబోధానంద

police case booked on prabodhananda swami at gutti ps

అమ‌రావ‌తి(గుత్తి): అనంతపురం జిల్లా గుత్తి పోలీస్‌స్టేషన్‌లో ప్రబోధానంద స్వామిపై కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించారంటూ తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు, జేసీ దివాక‌ర్‌రెడ్డి ముఖ్య అనుచ‌రుడు మధుసూదన్‌ గుప్తా ప్రబోధానందపై ఫిర్యాదు చేసి.. సీడీలను సాక్ష్యాలుగా అందజేశారు. వాటిని పరిశీలించిన పోలీసులు ప్రబోధానందపై కేసు నమోదు చేశారు.

కొద్దిరోజుల క్రితం తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామం వద్ద వినాయ‌క నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా ప్ర‌బోదానంద స్వామి భ‌క్తుల‌కు, జేసీ వ‌ర్గీయుల‌కు మ‌ధ్య ప‌ర‌స్ప‌ర వాగ్వాదం జ‌రిగి పెట్రోల్ బాటిళ్లు, రాళ్ల‌తో దాడి చేసుకున్నారు. దీంతో ఒక వ్య‌క్తి చ‌నిపోయారు. జ‌రిగిన‌ విధ్వంసానికి సంబంధించి ప్రబోధానందపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అయితే జేసీ దివాక‌ర్ రెడ్డి, సీఎం చంద్ర‌బాబును బుధ‌వారం అసెంబ్లీలో క‌లిసి కొన్ని వీడియోలు చూపించారు. త‌రువాత రోజు గుత్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ ఆయనపై ఫిర్యాదు చేసి.. సీడీలు, పెన్‌డ్రైవ్‌లు సాక్ష్యాలుగా అందజేశారు. ప్రబోధానంద ఎక్కడుంటారన్న దానిపై పోలీసుల వద్దా సమాచారం లేనట్లు తెలుస్తోంది.

మూడేళ్లుగా ఆశ్రమానికి రాని ప్రబోధానంద

స్వామి ప్రబోధానందకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆశ్రమాలు ఉన్నప్పటికీ చిన్నపొలమడ గ్రామం వద్ద ఉన్న ఆశ్రమాన్ని ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తుంటారు. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారన్న దానిపై ఎవరి వద్దా సరైన సమాచారం లేదు. ఆయన ఈ ఆశ్రమానికి వచ్చి మూడేళ్లు దాటినట్లు భక్తులు చెబుతున్నారు.

 

ఆశ్ర‌మంలో విస్తృతంగా త‌నిఖీలు

ప్రబోధానంద ఆశ్రమంలో అధికారుల బృందం మంగ‌ళ‌, బుధ‌వారాల్లో తనిఖీలు, విచారణ చేప‌ట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం చిన్నపొలమడలో ఉన్న ఆశ్రమాన్ని మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము 4 గంటల వరకు అధికారులు శోధించారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలను మాత్రం వెల్లడించలేదు. తనిఖీల్లో మరో 30 మంది ఆధార్‌కార్డులు లేకుండా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో వారిని బయటకు తీసుకొచ్చి స్వస్థలాలకు పంపేశారు. ఇంకా ఆశ్రమంలో 250 మందికిపైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆశ్రమ పరిసరాల్లో పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ నియమించిన విచారణ కమిటీ ప్రతినిధులు బుధవారం రాత్రి ఆశ్రమ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news