పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో నేతల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. నేతల మధ్య సమన్వయం లేకపోవడం జనసేన నేతలు సహకరించకపోవడంతో టిడిపి ఇన్చార్జి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ధన బలం ఉన్న నేతకి చంద్రబాబు సీట్ కేటాయించడంతో స్థానిక నేతలు అధినేతపై ఆగ్రహంగా ఉన్నారట..
టిక్కెట్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలపై స్థానిక నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. సుమారు ఐదేళ్ల నుంచి నియోజకవర్గానికి ఇన్చార్జిని నియమించలేకపోయారు చంద్రబాబు.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాన్ లోకల్ గా ఉన్న ఎన్ఆర్ఐ రోషన్ కుమార్ నీ తీసుకొచ్చి చింతలపూడిలో పోటీ చేయించాలని బాబు నిర్ణయించుకున్నారు. దీంతో రోషన్ను అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం.. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పటికీ నేతలు నుంచి సహకారం అందట్లేదని జిల్లాలో టాక్ వినిపిస్తోంది.
నియోజకవర్గంలో ఉండే కొందరు కమ్మ నేతలకు రోషన్ కుమార్ ముడుపులు చెల్లించుకుని టికెట్ తెచ్చుకున్నారని అసమ్మతి వర్గం ఆరోపిస్తోంది. గత నాలుగేళ్ల నుంచి ఈ నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఉన్నాయి. రోషన్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అవి కాస్తా ఎక్కువ అవడంతో ఆయన ఆలోచనలో పడ్డారట. మాజీ మంత్రి పీతల సుజాత వర్గానికి రోషన్ కుమార్ కి సఖ్యత లేదని తెలుస్తుంది.
వర్గాలను సమన్వయము చేసుకోవడం లో రోషన్ విఫలం అవుతున్నారని.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. క్యాడర్ సహకరించకపోతే రోషన్ గెలుపు అసాధ్యమని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరొక పక్క జనసేన ఇన్చార్జి ఈశ్వరయ్యకు.. రోషన్ బాబుకు మధ్య గ్యాప్ చాలానే ఉందని.. అందులో భాగంగానే ఇటీవల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారని చర్చ నడుస్తుంది. రోషన్ కుమార్ ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని.. దాంతో పార్టీ నష్టపోతోందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట.. టిడిపి అధినేత చంద్రబాబు జోక్యం చేసుకున్నప్పటికీ క్యాడర్ మాత్రం రోషన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుంది.. ఇదే కొనసాగితే చింతలపూడి నియోజకవర్గంలో టిడిపి భూస్థాపితం కావడం ఖాయం అనే టాక్ సొంత పార్టీలోనే వినిపిస్తుంది..