సీఎంను టార్గెట్ చేస్తూ పాలిటిక్స్.. ప్రవీణ్ కుమార్ ప్రభంజనం సృష్టిస్తారా?

-

ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అనే పేరు తెలంగాణలో ప్రస్తుతం మార్మోగుతుందని చెప్పొచ్చు. సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా ఆయన సేవలు ప్రతీ ఒక్కరికి తెలిసినవే. కాగా, ఆరేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ ప్రజల కోసం రాజీనామా చేసినట్లుగా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన బీఎస్పీలోకి వెళ్తున్నారు. కాగా, ఇప్పటి వరకు ప్రభుత్వంతో కలిసి పని చేసిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సూటి విమర్శలకు ప్రాధాన్యమిస్తున్నారు. బహుజనవాదం అనే అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చి ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించబోతున్నారా? అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సాగుతున్నది.

మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమకారుడిగా సీఎం కేసీఆర్ తీరుపై గౌరవంగా మాట్లాడిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం తన శైలి మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రవీణ్ బహుజన ఉద్యోగులతో సమావేశాల సందర్భంగా చేసిన వ్యాఖ్యలను బట్టి అధికార పార్టీని, ముఖ్యమంత్రిని కేసీఆర్ టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు‌గాను ప్రవీణ్ పదునైన వ్యూహాలను రచించుకున్నట్లు సమాచారం. ఫామ్ హౌజ్ నుంచి సీఎం కేసీఆర్‌ను తరిమి కొట్టాలని పిలుపునివ్వడం ద్వారా తన రాజకీయ కార్యచరణ ప్రకటించారని భావించొచ్చు. అయితే, బీఎస్పీ‌ని బహుజనుల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రవీణ్ కుమార్ ఎలాంటి వ్యూహాలను రచించబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఏకం చేయడమే ప్రస్తుతం కష్టమైన పనిగా ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా తనకు రాజకీయ అధికారం మీద ఆశలు లేవని, బహుజనులను రాజకీయంగా అధికారంలోకి తీసుకురావడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూస్తేనే ప్రవీణ్ కుమార్ రాజకీయ విధానాలు స్పష్టంగా అర్థం అవుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news