ఈనెల 17 కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోస్టర్లు కలకలం సృష్టించాయి. అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అర్ధరాత్రి పోస్టర్లు వెలిశాయి.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఏ విధంగా సాయపడిందో చెప్పాలని డిమాండ్ చేస్తూ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో పోస్టర్లు కనిపించాయి. కంటోన్మెంట్ యువత పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరో చెప్పుకోవాలంటూ కొన్ని పోస్టర్లు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో వెలిశాయి. అమిత్ షా సభను ఉద్దేశించి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన నాయకులు వీళ్లే అంటూ మరికొన్ని పోస్టర్లు కనిపించాయి. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో ఏ విధంగా సహకరించారో చెప్పాలంటూ 20 ప్రశ్నలతో కూడిన పోస్టర్లు కలకలం సృష్టించాయి.