పీకే సెన్సేషనల్ సర్వే..వైసీపీ లెక్క ఇదే?

ఏపీలో జగన్‌ని మళ్ళీ సీఎం చేయడం కోసం, వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఓడిపోయాక వైసీపీ వ్యూహకర్తగా పీకే పనిచేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2019లో వైసీపీ భారీగా సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడంలో పీకే పాత్ర మెయిన్. ఇక ఇప్పుడు కూడా పీకే…వైసీపీ కోసం పనిచేస్తున్నారు. మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం పీకే టీం ఫీల్డ్ లోకి దిగి పనిచేస్తుంది.

అయితే ఇప్పటికే పలు దఫాలుగా, అంశాల వారీగా పీకే టీం సర్వేలు చేస్తున్నట్లు కథనాలు వస్తూనే ఉన్నాయి. ఎమ్మెల్యేల పనితీరు, సంక్షేమ పథకాల అమలు…అలాగే ఏ ఏ రంగాల్లో ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి ఉందనే విషయంపై సర్వేలు చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారికి నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కష్టమని తేల్చేశారు.

ఇక తాజాగా పీకే టీం మరో సర్వే చేసినట్లు తెలిసింది..దాదాపు 40-45 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని వారికి, నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వకూడదని పీకే టీం..వైసీపీ అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. అలాగే 20 నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఎక్కువ ఉన్నాయని తేలిందట. సిటీ ఓటర్లు, నిరుద్యోగ యువత, వ్యాపార వర్గాలు, ఉద్యోగులు, రైతు వర్గాల్లో వైసీపీపై వ్యతిరేకత ఉందని తెలిసిందట. అయితే నూటికి నూరు శాతం వ్యతిరేకత కాదని, 50 శాతం వరకు మాత్రమే వ్యతిరేకత ఉందని తెలిసింది.

ఇక ప్రాంతాల వారీగా చూసుకుంటే వైసీపీకి అనుకూలంగా ఉండే నియోజకవర్గాలు చూసుకుంటే…ఉత్తరాంధ్రలో మొత్తం 34 సీట్లు ఉండగా…వైసీపీకి 15-17 సీట్లలో గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలిందట. ఇక ఉభయగోదావరి జిల్లాలో మొత్తం 34 సీట్లు ఉంటే 10-13, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 33 సీట్లు ఉంటే 12-14, ప్రకాశం-నెల్లూరు జిల్లాల్లో 22 సీట్లు ఉంటే 14-16, రాయలసీమ జిల్లాల్లో 52 సీట్లు ఉంటే..38-40 సీట్లలో వైసీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయట. అంటే మొత్తం 175 సీట్లలో 89-100 సీట్లలో వైసీపీకి గెలిచే ఛాన్స్ ఉందని పీకే టీం సర్వేలో తేలిందట.

ఇదంతా ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీకి వచ్చే సీట్లు…ఎన్నికల నాటికి ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయో..అదే సమయంలో టీడీపీ-జనసేన పొత్తు ఉంటే ఎలాంటి పరిస్తితులు ఉంటాయో చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు.