గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా నెగ్గుకు వచ్చింది ఏమీ లేదు.2014 లోక్ సభ ఎన్నికల్లో కానీ 2019 లోక్ సభ ఎన్నికల్లో కానీ ఆ పార్టీకి దక్కిన ఓటింగ్ శాతం చాలా అంటే చాలా తక్కువని ప్రియాంకను ఉద్దేశించి మీడియా పదే పదే చెబుతోంది. ఒకసారి ఏడున్నర శాతం, మరోసారి ఆరు శాతం ఓటింగ్ వచ్చిందని ఫలితాలే వెల్లడి చేస్తున్నాయి.ఈ క్రమంలో ప్రాంతీయ శక్తుల చేతిలో జాతీయ పార్టీ నెగ్గడం అస్సలు కష్టం. అదేవిధంగా బీజేపీ శక్తిని దాటి కృషి చేయగలదు కానీ కాంగ్రెస్ కు శక్తి మేరకు పనిచేయాలన్నా కూడా అంతర్గత కారణాలు మరియు కలహాలు అనేకం. కనుక ఆమె సంస్కరణల నేపథ్యంలో కొత్త ముఖాలకు టిక్కెట్లు ఇచ్చారని చెబుతున్నా, మహిళలకు టిక్కెట్లు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని నిర్ణయంలో ఉన్నా అవేవీ ఓటు బ్యాంకు రాజకీయాలను పెద్దగా ప్రభావితం చేయవనే ప్రధాన మీడియా చెబుతోంది. పార్టీ తరఫున పోటీచేసే వారికి సంబంధించి ఇప్పటిదాకా 166 మందికి టిక్కెట్లు కన్ఫం చేస్తే అందులో 119 మంది మహిళలే ఉన్నారని తేలిపోయింది. అయినా కూడా ఆ పార్టీ ఒడ్డెక్కడం కత్తి మీద సామే!
నేను అమ్మాయిని అయినా పోరాడగలను అని చెబుతున్నారు కాంగ్రెస్ నాయకురాలు,రాజీవ్ గాంధీ వారసురాలు ప్రియాంక గాంధీ.అక్కడున్న స్థితిగతుల నేపథ్యంలో ఆమె అలా మాట్లాడడం తప్పు కాదు కానీ, కాంగ్రెస్ కు ఆ మాటలు బలం ఇస్తాయే కానీ ప్రియాంకకు కొత్త శక్తిని మాత్రం అవి ఇవ్వవు. ముఖ్యంగా కాంగ్రెస్ కు యోగీ లాంటి ధీశాలిని ఎదుర్కోవడంలో వ్యూహం అస్సలు చాలదు. ప్రియాంక ఏవో కొన్ని నియోజకవర్గాలకు పరిమితం కావొచ్చు కానీ పార్టీకి పునరుజ్జీవం ఇవ్వలేరు.అఖిలేశ్ యాదవ్ లాంటి వారికే అక్కడ ఓటరు చుక్కలు చూపిస్తున్నాడు.అలాంటిది ప్రియాంక ఏ విధంగా తన పంతం నెగ్గించుకోగలరని?
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ఎలాంటి ఫలితాలు ఇవ్వనున్నాయి అన్న మీమాంస నుంచి కాంగ్రెస్ ఇప్పటికప్పుడు బయటపడడం కష్టం. ఎన్నికలు జరగాలి? వాటి ఫలితాలు తేలాలి? అనుకున్నదాని కంటే మంచి స్థాయి అందుకున్నామా లేదా అన్న ఆలోచన ఒకటి స్పష్టంగా చేయగలగాలి.అందుకే ప్రియాంక గాంధీ తనని తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుని మళ్లీ నాలుక కరుచుకున్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సులువు కాదు.ఆశించిన సీట్లు రావడం అంటే ప్రకటనలు ఇస్తున్నం సులువు అంత కన్నా కాదు. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ లాంటి ప్రాంతీయ శక్తులను దాటుకుని రావడం ఇవాళ అక్కడ కాంగ్రెస్ కు సునాయాసం కాదు.అదేవిధంగా బీజేపీ ఢీ కొనడం కూడా!