పుంగనూరు దాడులు-కేసులు..ఏ1గా బాబు..ప్రజలే తేల్చుకోవాలి.!

-

ఏపీలో ఎన్నికల ఇంకా రాక ముందే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడి మాత్రమే కాదు..చేతల దాడి జరిగిపోతుంది. రెండు పార్టీల శ్రేణులు దాడులు చేసుకునేవరకు వెళ్లిపోయాయి. ఇటీవల చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించగా, అక్కడ తంబళ్ళపల్లెలో ఆయన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రాళ్ళతో దాడి చేశాయి. ఇక వారిపై టి‌డి‌పి శ్రేణులు దాడి చేశారు. తర్వాత పుంగనూరు బైపాస్ లో పోలీసులు…టి‌డి‌పి శ్రేణులపై లాఠీ చార్జ్ చేశాయి.

ఆ తర్వాత టి‌డి‌పి శ్రేణులు రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. పోలీసులు సైతం రాళ్ళతో దాడి చేశారు. ఇలా ఎక్కడకక్కడ పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. అయితే వీటిల్లో ఎవరిది తప్పు..ఎవరిది ఒప్పు అని తేల్చుకోవడానికి ఏమి లేదు. టి‌డి‌పి వాళ్ళే వైసీపీ శ్రేణులపై, పోలీసులపై దాడులు చేశారని..కేసులు పెట్టారు. కొందరిని అరెస్ట్ చేశారు.  తాజాగా తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ముదివేడు పోలీస్‌స్టేష‌న్‌లో వైసీపీ నాయ‌కుడు ఉమాప‌తిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు చంద్ర‌బాబుతో పాటు ప‌లువురు ముఖ్య నాయ‌కుల‌పై కేసులు న‌మోదు చేశారు.

తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం అంగ‌ళ్లులో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి ఎ1గా చంద్ర‌బాబు, ఎ2గా మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ఎ3గా మాజీ మంత్రి అమ‌ర్నాథ్‌రెడ్డి, ఎ4గా పీలేరు టీడీపీ ఇన్‌చార్జ్ న‌ల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, ఇంకా పలువురు నేతలపై కేసులు పెట్టారు. అసలు తమపై దాడులు చేసి..తమపైనే కేసులు పెట్టడం ఏంటని టి‌డి‌పి శ్రేణులు మండిపడుతున్నాయి.

ఇక తనపై పలుమార్లు రాళ్ళ దాడి చేసి..పుంగనూరులో హత్యాయత్నం చేయాలని చూశారని, పైగా రివర్స్‌లో తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. తనను హత్య చేయాలనే వైసీపీ గూండాలు వచ్చారన్నారు. ఎన్‌ఎస్‌జి కమెండోలు పలు సార్లు తన ప్రాణాలు కాపాడారన్నారు. పుంగనూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లు మీదకు రావలసిన అవసరమేంటని ప్రశ్నించారు. దాడులపై సీబీఐతో విచారణ జరగాలని,  చిత్తూరు ఎస్పీది అమానుష వైఖరని అన్నారు.

అయితే బాబు పర్యటన ఉంటే వైసీపీ శ్రేణులు రావడం, వారు కొందరిని కొడుతున్న వీడియోలు ఉన్నాయి. ఇటు టి‌డి‌పి శ్రేణులు దాడులు చేసిన వీడియోలు ఉన్నాయి. కానీ టి‌డి‌పి నేతలపైనే కేసులు పెట్టారు. మరి పుంగనూరు ఘటనలో ఎవరికి తప్పో..ఎవరిది ఒప్పో ప్రజలే తేల్చుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news