మా షేర్ రాజాసింగ్ ఎక్కడ.. బీజేపీ సభలో కార్యకర్తల నినాదాలు

ప్రజాసంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ఇతర నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. సభలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతుండగా.. ఓ వర్గం అభిమానులు మా షేర్ రాజాసింగ్ ఎక్కడ అంటూ నినాదాలు చేశారు.

రాజాసింగ్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ గట్టిగట్టిగా అరిచారు. ఈ పరిణామంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. రాజాసింగ్ కు ఇంత మంది అభిమానులున్నారా అంటూ ఆశ్చర్యపోయారు. గందరగోళం ఎక్కువ అవుతుందని భావింతిన బండి సంజయ్.. వాళ్లని సముదాయించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడారు.

ఇటీవల రాజాసింగ్ ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పార్టీ క్రమశిక్షణ సంఘం భావించింది. ఈ మేరకు రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఆయనపై పలు స్టేషన్లలో కేసులు నమోదు కాగా… ప్రస్తుతం పీడీ యాక్ట్‌ కింద రాజాసింగ్ జైలులో ఉన్నారు.