పట్టుమని వంద రోజులు కూడా కాని.. జగన్ పాలనపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందా? ఆయనను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టేందుకు కీలక నాయకులు చక్రం తిప్పుతున్నారా? రాష్ట్రంలో శాంతి భద్రతల సమ స్య సృష్టించి.. జగన్ విఫలమయ్యాడంటూ.. ఓ ముద్ర వేసి.,. రాష్ట్రంలో రాజకీయ అశాంతికి తెరదీసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయా? అంటే.. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఔననే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపేలా కనిపిస్తున్నాయి. ఒకపక్క రాష్ట్ర రాజధాని అమరావతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అధికార విపక్షాలు రెండూ కూడా తీవ్ర పోరు సాగించుకుంటున్నాయి. ఈ విషయంలోనే ఒక క్లారిటీ లేక పోవడంతో రెండు పార్టీల వారు కూడా పెద్ద ఎత్తున పోట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంతలోనే పానకంలో పుడక మాదిరిగా .. టీజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజధానిగా అమరావతిని తొలగించే అంశంపై సీఎం జగన్మోహన్‌రెడ్డి బీజేపీ అధిష్ఠానంతో చర్చించారని టీజీ వెల్లడించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి ఢిల్లీ వెళ్లినప్పుడే ఆయన బీజేపీ పెద్దలతో దీనిపై మాట్లాడారని.. ఈ విషయాన్ని పార్టీలోని ఓ ముఖ్య నాయకుడు తనకు చెప్పారని తెలిపారు. అయితే ఆ నాయకుడి పేరును బహిర్గతం చేయడం తనకు ఇష్టం లేదన్నారు.
రాష్ట్రాన్ని నాలుగు ప్రణాళికాబోర్డులుగా విభజించి.. నాలుగు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నారని.. అందుకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేని విధంగా నలుగురు డిప్యూటీ సీఎంలను జగన్ నియమించుకున్నారని తెలిపారు. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాలు విజయనగరం బోర్డులో, ఉభయగోదావరి-కృష్ణా జిల్లాలు (ఇప్పుడున్న అమరావతి సహా) కాకినాడ బోర్డులో, గుంటూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాలు గుంటూరు బోర్డులో, రాయలసీమ 4 జిల్లాలు కడప బోర్డులో ఉంటాయని టీజీ చెప్పారు. అయితే, నిన్నగాక మొన్న బీజేపీలో చేరిన టీజీకి ఈ చిదంబర రహస్యం ఎవరు చెప్పారనే విషయం చర్చనీయాంశంగా మారింది.
పైగా ఇది ప్రాంతీయ వాదానికి, వివాదానికి దారితీస్తుందని అంటున్నారు పరిశీలకులు. ఈ వ్యాఖ్యల వెనుక, టీజీ వ్యూహం వేరే ఉందని, రాష్ట్రంలో ప్రాంతీయ వాదానికి తెరదీయాలనే లక్ష్యం ఉందని అంటున్నారు. ఇప్పటికే రాజధాని కోసం కర్నూలు వాసులు తెరమీదికి వివాదం తెస్తున్నారు. హైకోర్టు బెంచ్ అయినా ఏర్పాటు చేయాలని, రెండో రాజధానిగా అయినా ప్రకటించాలని కోరుతున్నారు. ఇక, తూర్పు, పశ్చిమ గోదావరుల మాట అటుంచి, ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రమే చేయాలనే డిమాండ్ ఉంది. ఇలా ఉన్న నేపథ్యంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి దారిపడతాయో తెలియదు కానీ, ఇప్పటికిప్పుడు టీజీ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.