టీపీసీసీ కి నూతన సారథిగా బాధ్యతలు స్వీకరించిన అనుముల రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కి రోజుకో కొత్త సమస్య వచ్చి పడుతోంది. నిన్న, మొన్నటి దాకా పార్టీ సీనియర్ నేత సహచర ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బహిరంగానే విమర్శించారు. ఆయన కాస్త సైలెంట్ అయ్యారో లేదో రేవంత్ కు మరో చిక్కు వచ్చిపడింది. అసలు విషయం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీ ఆగస్టు తొమ్మిదో తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి వేదికగా దళిత దండోరా అనే సభ నిర్వహించాలని ప్లాన్ చేసింది.
అందుకు ఏర్పాట్లలో భాగంగా సభ బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు అప్పగించారు. దీంతో ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలక బూనారు. తన పార్లమెంటు పరిధిలో తనకు తెలియకుండా దళిత దండోరా సభ ఎలా నిర్వహిస్తారని ఆయన పార్టీ అధినేత రేవంత్ రెడ్డి పై గుర్రుగా ఉన్నారు.
కొన్ని రోజుల కిందట ఆయన శ్రీలంక పర్యటనకు వెళ్లారు. దీంతో ఎలాగా అని తల పట్టుకుంటున్న రేవంత్ రెడ్డికి ఏ ఉపాయం తోచలేదు. ఆయన శ్రీలంక నుంచి వచ్చిన తరువాత పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ వెళ్లి మహేశ్వర్ రెడ్డిని సముదాయించారు. దీంతో కాస్త తగ్గిన మహేశ్వర్ రెడ్డి ఇంద్రవెల్లి సభ బాధ్యతను ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కు అప్పగించాలని డిమాండ్ చేయగా.. అందుకు సరేనంటూ జానారెడ్డి, షబ్బీర్ అలీ ఒప్పుకున్నారు. దీంతో ఇంద్రవెల్లి సభ బాధ్యతల నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును తొలగించి నూతనంగా ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కు బాధ్యతలు అప్పగించారు.