కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈడీ పేరుతో పార్టీ నాయకులను వేధిస్తోందని విమర్శించారు. ముఖ్య నాయకులను ఈడీ కేసులతో భయపెట్టి బీజేపీలోకి చేర్చుకోవాలని చూస్తోందన్నారు.
‘‘రాహుల్ పాదయాత్రతో మార్పు వస్తుందనే ఉద్దేశంతోనే గతంలో మూసేసిన హెరాల్డ్ కేసును మళ్లీ తెరిచారు. ఈడీ అధికారులను ఉసిగొల్పి రాహుల్ గాంధీని విచారణకు పిలిచారు. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నా.. ఆమెను విచారణకు పిలిచి వేధించారు. అయినప్పటికీ భారత్ జోడో యాత్ర ఆగకపోవడంతో రాష్ట్రాల నేతలకు నోటీసులు ఇస్తున్నారు. కర్ణాటకలో యాత్రను అడ్డుకోవడానికి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌ను ఈడీ విచారణకు పిలిచింది. ఏయే రాష్ట్రాల్లో పాదయాత్ర ఉందో.. అక్కడి నేతలకు ఈడీ నోటీసులిస్తోంది’’ అని రేవంత్ అన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని బీజేపీ ‘ఎలక్షన్ డిపార్ట్ మెంట్’గా మార్చుకుందని రేవంత్ విమర్శించారు. ‘‘గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ లాంటి క్రియాశీల నాయకులకు ఈడీ నోటీసులిచ్చింది. రూ.కోటి చందా ఇచ్చినందుకు ఐదుగురు నేతలకు నోటీసులిచ్చారు. వారిని భయపెట్టి పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలని చూస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.