యాక్టివ్ మోడ్‌లోకి సోష‌ల్ మీడియా.. రేవంత్ ప్లాన్ ఇదే

-

తెలంగాణ‌లో జ‌రిగిన గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సోష‌ల్ మీడియా ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది.కేసీఆర్ చేతిలో కొన్ని ఛాన‌ళ్ళు,సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఉన్న‌ప్ప‌టికీ గులాబి పార్టీని కాంగ్రెస్ ఓడించ‌గ‌లిగింది.దీనికి కార‌ణం సోష‌ల్ మీడియాను కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం చేయ‌డ‌మే.ప‌దేళ్ళ‌లో కేసీఆర్ చేసిన త‌ప్పుల‌ను,పాల‌న‌లో వైఫ‌ల్యాల‌ను సోషల్‌ మీడియా ద్వారా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌గ‌లిగారు రేవంత్‌రెడ్డి.ఈ ప్లాన్‌తో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది.ప‌దేళ్ళ‌పాటు ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది.

revanth reddy

దీంతో అంతా సోషల్‌ మీడియా మ‌హిమే అని అప్ప‌ట్లో క‌థ‌నాలు వ‌చ్చాయి.అయితే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ‌లో నామ‌రూపాల్లేకుండా చేయాల‌నుకుంటున్న రేవంత్‌రెడ్డి మ‌రోసారి సోష‌ల్ మీడియాను స్ర్టెంథెన్ చేయ‌బోతున్నారు. పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య మళ్లీ సోషల్‌ వార్‌ తప్పేలా లేదని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.బీఆర్ఎస్‌ పెట్టే ప్ర‌తి పోస్ట్‌కీ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇవ్వ‌డ‌మే ల‌క్ష్యంగా సోషల్‌ మీడియా వింగ్‌ను మ‌ళ్ళీ రెడీ చేస్తోంది కాంగ్రెస్‌.

గ‌త ఏడాది చివ‌ర‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా యాక్టివ్‌గా ఉండేది కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వింగ్‌. ఎన్నిక‌లు ముగిసి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక సోష‌ల్ మీడియాలో ఉద్యోగులను తగ్గించింది. దీంతో దాని ప్రభావం కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే బీఆర్ఎస్‌ను జీరో చేయాలంటే సోష‌ల్ మీడియా మ‌ళ్ళీ ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేయాల‌ని అంటున్న రేవంత్‌రెడ్డి దానిని బలోపేతం చేయడంలో భాగంగా మరోమారు రిక్రూట్‌మెంట్‌ చేపట్టారు.

ఇందులో భాగంగా సోషల్‌ మీడియా వింగ్‌ లోనే ఎక్కువగా నియామకాలు చేస్తోందని సమాచారం. రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనలో ఫేక్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ బీఆర్‌ఎస్‌ మూడు రోజులుగా ప్ర‌చారం చేస్తోంది. ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ కూడా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. గతంలో మీరు చేసిన ఒప్పందాల సంగతేంటి అంటూ పాత ఒప్పందాలను బయటకు తీస్తోంది. ఇలా సోష‌ల్ మీడియాలో బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ ర‌చ్చ మొద‌లై మరోసారి ఎన్నిక‌ల సంగ్రామాన్ని త‌ల‌పిస్తోంది.

బీఆర్ఎస్ ప‌దేళ్ళ పాల‌న‌ వైఫల్యాలను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వింగ్ ఎన్నికల‌ స‌మ‌యంలో బాగానే ఎండగట్టింది. ఇప్పుడు అదే సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ను వెంటాడుతోంది కేటీఆర్‌ టీం.కాంగ్రెస్‌ అడుగు తీసి అడుగు వేసినా బీఆర్ఎస్‌ కామెంట్‌ చేస్తోంది. దీంతో తప్పనిసరి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ ప్రతిస్పందించాల్సి వస్తోంది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా టీమ్స్‌ స్పీడ్‌ కూడా తగ్గిపోయింది.

బీఆర్ఎస్ అటాక్ చేస్తున్న‌ నేపథ్యంలో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా స్ట్రెంథెన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. దీంతో వ్యూహకర్త సునీల్‌ కనుగోల్‌ టీంని మరోసారి రంగంలోకి దించాల్సి వ‌స్తోంది. సోష‌ల్ మీడియా మళ్లీ యాక్టివ్‌ అయ్యేందుకు చర్యలు తీసుకుంటోంది. గత పదేళ్లు బీఆర్‌ఎస్‌ చేసిన తప్పులను మరోసారి ఎత్తి చూపేందుకు సిద్ధమవుతోంది రేవంత్ స‌ర్కార్‌. దీంతో తెలంగాణ‌లో మ‌రోసారి ఎన్నిక‌ల స్టంట్ మొద‌లైంద‌ని జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news