రివర్స్ టెండరింగ్ నుంచి రివర్స్ పాలిటిక్స్ వైపు జగన్

ఏపీలో కొత్త తరహా రాజకీయానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. మేనిఫెస్టోలో హామీలు నూరు శాతం అమలు చేస్తే తిరుగులేదని లెక్కలేసిన వైసీపీ అధినేత మళ్లీ రూటు మార్చాడు. తాజాగా నియోజకవర్గ స్థాయిలో పార్టీకి రాజకీయంగా కలిసి వచ్చే అంశాల పై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. అది కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి మైలేజ్ వస్తే చాలానే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో తిరుగులేని ఇమేజ్ పొందిన పాతతరం రాజకీయనేతలను హైలెట్ చేస్తూ రివర్స్ పాలిటిక్సు కి బాటలు వేస్తున్నారు.

ఏపీలో జగన్ సర్కార్ ఇచ్చిన మాట మీద నిలబడటంపై పూర్తిగా ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేసేలా అడుగులు వేస్తోంది. గతంలో జిల్లాల్లో జగన్ పర్యటనల్లో నోటి మాటగా ఇచ్చిన హామీలు ఏమైనా ఉన్నాయా..వాటిని వెంటనే అమలు చేయడానికి ఆటంకాలు ఉన్నాయా? ఉంటే వాటిని సర్దుబాటు చేయడం ఎలా అనే అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ప్రభుత్వ విధానాల పై ఆరోపణలు గుప్పించే ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతల పేర్లు సైతం ప్రభుత్వ ప్రాజెక్టులకు పెట్టేస్తున్నారు.

మేనిఫెస్టోలో అంశాలు..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ప్రభుత్వం మీద విమర్శలు లేవంటోంది వైసీపీ. ఐతే వీటి మీద ఇప్పటికీ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నాయి ఏదో ఒకరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. అయినా ప్రతిపక్ష ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదని వైసీపీ భావిస్తోంది. ఈ అంశం ఇటీవల వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారానే స్పష్టమైందని చెబుతోంది. ఐతే..ఇదే పనిగా ప్రతిపక్షాలు డామేజ్ చేస్తూ పోతూ ఉంటే..ప్రజల్లో కాస్తోకూస్తో ఆ ఇంపాక్ట్ పడే ప్రమాదం లేకపోలేదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో లోకల్ అంశాలకు ప్రయార్టీ ఇవ్వాలని భావిస్తోన్నట్టు తెలుస్తుంది.

అందులో భాగంగా భవానీపురం వంతెనకు టీడీపీ సీనియర్ నేత దివంగత అంబటి బ్రాహ్మణయ్య పేరు పెట్టారు. అంబటి బ్రాహ్మణయ్య రాజకీయ జీవితం అంతా తెలుగుదేశంతోనే ముడిపడి ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యే, ఓసారి ఎంపీగా పని చేసిన అంబటి బ్రాహ్మణయ్య తెలుగుదేశానికి నికార్సైన నాయకుడిగా అవనిగడ్డ-బందరు నియోజకవర్గాల్లో పేరుంది. అలాంటి అంబటి బ్రాహ్మణయ్య పేరును ఆ వంతెనకు పెట్టడంపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. గతంలో వైసీపీలో చేరే సందర్భంలో అంబటి బ్రాహ్మణయ్య తనయుడు తన తండ్రి పేరును సదురు వంతెనకు పెట్టాలని కోరారట. దీనిపై స్థానికుల అభిప్రాయం తోపాటు మంత్రి పేర్ని నాని అభిప్రాయాన్ని కూడా గతంలోనే తీసుకున్నారట సీఎం జగన్.

సుదీర్ఘ కాలం పాటు బందరు, అవనిగడ్డ నియోజకవర్గాల ప్రజలకు సేవలందించిన అంబటి పేరు పెడితే తప్పేం లేదని పేర్ని నాని కూడా చెప్పారట. ఇటీవల ఈ విషయాన్ని మంత్రి పేర్ని నాని, స్థానిక ఎమ్మెల్యే సింహద్రి రమేష్ బాబు ప్రభుత్వ పెద్దలకు గుర్తు చేయడంతో వెంటనే ఆమోద ముద్ర వేశారు సీఎం జగన్. సదురు బ్రిడ్జికి తన తండ్రి పేరు పెట్టాలని చంద్రబాబును అంబటి బ్రహ్మణయ్య తనయుడు కోరినా.. అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదని తెలుగుదేశం నేతగా ముద్రపడిన అంబటి బ్రాహ్మణయ్య పేరును చిరస్థాయిగా నిలిచేలా వైసీపీ ప్రభుత్వం చేసిందనే చర్చ స్థానికంగా జరుగుతోంది. ఈ రివర్స్ స్ట్రాటజీ స్థానికంగా వైసీపీకి మంచి మైలేజ్ తెచ్చిందట. ప్రతిపక్ష పార్టీలో ఆ పార్టీ కార్యకర్తల్లోనూ ప్రభుత్వంపై సాఫ్ట్ కార్నర్ ఏర్పడేలా చెసిందని చెప్పుకుంటున్నారు స్థానిక వైసీపీ నేతలు.